పుట:Manimalikalu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46. గతించిన కాలములో గడించిన అనుభవమంతా
రాబోయే రోజుల్లోకాబోయే ములధనమేగా|

47. రహదారి నిండా రాలినపూలే
మానవత్వాన్ని ఈదారినే తీసుకుపోయారా|

48. అందరూ తిడుతున్నారు తెలుసా
అక్షరాలన్నీ నీకోసమే ఖర్చుచేసేస్తున్నానని

49. నీపరిచయంలోని మాధుర్యమేగా
నాకు మదుమేహాన్ని పరిచయం చేసింది

50. ఎంత విచిత్రం!
నువ్వులేని నీలో నేనుండటం. నేను లేని నాలో నువ్వుండటం

51. నీ తలపుల తాకిడి తీవ్రతకి
నామది తలుపులు బద్దలయ్యేలా వున్నాయి

52. వేకువ వళ్ళు విరుచుకుంటోంది
చీకటి చాపను చుట్టేసి... దిక్కుల చాటుకి విసిరేసి

53. నాకలల్ని పండించుకోవాలి
నీ హృదయాన్ని కౌలికిస్తావా?

54. రాతిరంతా గస్తీ తిరుగుతాడు చందురుడు
కలువబాల మనసు ఎవరైనా కొల్లగొడతారేమోనని

55. నా హృదయాన్ని సిద్దం చేసా
నీ ప్రేమ వంగడాన్ని సాగు చేయడానికి

మణి మాలికలు = ప్రసాద్ అట్లూరి