పుట:Manimalikalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మౌలికమైన భేదం ఉంది. వాటన్నిటికీ అక్షరాలు, క్లుప్తతే ప్రాతిపదిక. అయితే ఇందులో పదాల సంఖ్య ముఖ్యం. క్లుప్తత అనేది రెండింలోనూ సమానధర్మం. మణిమాలికలు మొదటి పాదంలో అవసరాన్ని బట్టి రెండో మూడో పదాలుంటాయి. రెండో పాదంలో మొదటి పాదం పదాల సంఖ్యతో సమానంగా నైనా ఉండొచ్చు లేదా దాని గుణిజాల్లో పదాలు ఉండొచ్చు. ఉదాహరణకు మొదటి పాదంలో రెండు పదాలుంటే రెండో పాదాంలో రెండుగానీ నాలుగుగానీ ఆరుగానీ పదాలుంటాయి. ఆరు కంటే ఎక్కువ పదాలుండకూడదని నియమం ఉంది. ఇక నిర్మాణరీతి వల్ల ఒక లయ స్వచ్చంగా ఏర్పడే అవకాశం ఉండనే ఉంది. మణి మాలికలు తెలుగు కవిత్వానికి ఒక చేర్పుగా వినూత్న కవితారూపంగా సృజనాత్మకతలో కొత్తదానం గల ప్రక్రియగా అవతరించగలదాని ఆశించవచ్చు.

మణిమాలికల్లో తాత్విక భావ చైతన్యం మెండుగా ఉంది. హైకూలు కాసింత విరామం పాటించి చదివితే ఊహించుకునే కొలదీ పెద్ద దృశ్యం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఇందులో అలా కాదు. తక్షణమైన స్పందన మెరుపులా తడుతుంది. అడ్డంకులు లేకుండా సులభంగా ప్రవేశించగలగడం పనుల మధ్య, ప్రయాణాల్లోనూ మనసులో కలిగిన భావాన్ని అంది పుచ్చుకుని సులువుగా రాయొచ్చు. రాసేవారికి చదివే వారికీ ఆత్మతృప్తి.

సౌందార్యాత్మకత, తత్వ జిజ్ఞాస అనుభూతి అనుభవ సాంద్రత జీవిత సత్యాన్వేషణ ఈ మణి మాలికలలో పుష్కలంగా ఉంది. సాధారణ పదాల ద్వారా కవితా నిర్మాణాన్ని సాధించి గంభీరమైన లోతైన అర్థాన్నిచ్చే ద్విపదాలెన్నో ఉన్నాయి. ఇందులో వేగం, యాంత్రికత చోటు చేసు కున్న నేటికాలంలో ఇలాంటి లఘు ప్రక్రియలు పుట్టుకు రావడం సహజమే. అది చొచ్చుకుపోయి నలుగుర్నీ ఆకర్షించి పదికాలలు నిలబడుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఒక చిన్న కవితలో అనంతమైన అర్థవిస్స్తృతి ఉంటుంది. చదావగానే మనం కొన్ని అనుభవాలు తవ్వుకోవాలి. కొన్ని జ్ఞాపకాల్ని స్మృతికి తెచ్చుకోవాలి. కొన్ని అనుభూ తుల్ని సంలీనం చేసుకోవాలి. ఏకకాలంలో ఇవన్నీ సంభవించి మన సంస్కారం ఉన్నతీకరించబడాలి. కొన్ని మణిమాలికల్ని పరిశీలిద్దాం.

ఊహలు మనసును మోసే గుర్రాలైతే
వాస్తవాలు ఎగిరి తన్నే గాడిదలు (ప్రసాద్‌ అట్లూరి)


ఊహలకు అదుపాజ్ఞలు ఉండవు. అవకాశం ఇవ్వాలే గానీ చెలరేగి పోతాయి. అవి ఎల్లాంటివి? మనసును మోసే గుర్రాల్లాంటివి. అది అలా ఉంచండి. మరి వాస్తవాలు? గిల్లి చూసుకుంటే వాస్తవంలోకి వస్తాం. వాస్తవాలు ఊహలంత సజావుగా ఉంటాయని చెప్పలేం. ఊహలకు భిన్నంగా ఉంటాయి. అవి ఎల్లాంటివి? ఎగిరి తన్నే గాడిదల్లాంటివి.

12