పుట:Mana-Jeevithalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కాని, ఏదో మార్గాన్ని అవలంబించటం అర్థం చేసుకోవటం కాదు. అర్థం అయేది మనస్సుకి చెందినది కాదు. ఆలోచనతో కూడినది కాదు. ఆలోచనకు నిశ్శబ్దంగా ఉండే శిక్షణ నిచ్చి మనస్సుతో ప్రమేయం లేని దానిని పట్టుకోజూచినట్లయితే, అప్పుడు అనుభవంలోకి వచ్చేది గతం యొక్క ప్రతిరూపం మాత్రమే; ఈ ప్రక్రియ అంతా తెలుసుకోవటంలోనే అనుభోక్తతో ప్రమేయం లేని నిశ్శబ్దం ఉంటుంది. ఇటువంటి నిశ్శబ్దంలోనే అవగాహన కలుగుతుంది.

16. నిద్ర

శీతాకాలం, చలి విపరీతంగా ఉంది. చెట్లు మోడులైపోయాయి. ఆకులన్నీ రాలిపోయి కొమ్మలు బోడిగా ఉన్నాయి. ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. అవి కూడా చల్లగాలులకూ రాత్రిళ్లు కురిసే మంచుకి గురి అవుతున్నాయి. దూరాన ఎత్తైన కొండల నిండా దట్టంగా మంచు. వాటిపైన తెల్లటి కెరటాల్లాంటి మబ్బులు వ్రేలాడుతున్నాయి. గడ్డి మట్టిరంగులో ఉండి. ఎన్నో నెలల నుంచి వర్షాల్లేవు. వసంతకాలపు వానల కింకా చాలా కాలం పడుతుంది. భూమి నిద్రావస్థలో ఉన్నట్లు, సాగు చేయకుండా పడిఉన్నట్లుగా ఉంది. పచ్చని చెట్లమీద గూళ్లు కట్టుకుని కిలకిలమంటూ ఎగిరే పక్షుల్లేవు. దారులన్నీ గట్టిపడి మట్టికొట్టుకొని ఉన్నాయి. సరస్సులో కొన్నిబాతులు దక్షిణం వైపుకి మధ్యమధ్య ఆగుతూ పోతున్నాయి. కొత్త వసంతం వస్తుందని ఆశపెడుతున్నాయి పర్వతాలు. భూమి దానిగురించి కలగంటోంది.

నిద్ర అనేది లేకపోతే ఏమవుతుంది మనకి? ఇంకా కొట్లాడుకోవడానికీ, కుట్రలుపన్నటానికీ, అల్లరి తలపెట్టటానికీ మరింత సమయం దొరుకుతుందా? మనం మరింత క్రూరంగా, దయాదాక్షిణ్యాలు లేకుండా ఉంటామా? లేక, నమ్రత, దయ, పొదుపు చూపించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందా? మనం మరింత సృజనాత్మకంగా అవుతామా? నిద్ర చాలా చిత్రమైనది. దానికి అసాధారణమైన ప్రాముఖ్యం ఉంది. చాలా మందికి వారి దైనందిన చర్యలన్నీ రాత్రిళ్లు నిద్రలో కూడా కొనసాగుతూ ఉంటాయి. నిద్రలో కూడా వారి జీవితం