పుట:Mana-Jeevithalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తిలోని బహుముఖాలు

39

అయినా, ఆ గొంతు వాగుతూనే ఉంటుంది. మనలో అనేక కంఠాలు, అన్నిటిలోకీ నిశ్శబ్దంగా ఉన్న ఒక కంఠాన్ని వినాలని ప్రయత్నిస్తాం. ఆ ఒక్క కంఠాన్నీ వినటానికి తక్కినవన్నీ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే, ఆ ఒక్కదానిలో అనేకం ఉన్నట్లే. కాని, అనేకం ఎన్నటికీ ఆ ఒక్కదాన్ని కనుక్కోలేవు.

ఇప్పుడు మన సమస్య ఆ ఒక్క గొంతునీ ఎలా వినాలా అని కాదు; మొత్తం వాటి కూర్పుని, అనేకమైనవన్నీ కలిసి మనం ఎలా రూపొందామో అర్థం చేసుకోవటమే మన సమస్య. బహుముఖాల్లో ఒకటి అన్నిటినీ అర్థం చేసుకోలేదు. ఒక రూపం తక్కిన రూపాల్ని అధీనంలో ఉంచుకుని వాటికి శిక్షణ నిచ్చి, వాటిని తన పద్ధతిలో రూపొందించటానికి ప్రయత్నించినా, దాని ప్రయత్నాలన్నీ స్వార్ధపరమైనవి, సంకుచితమైనవి గానే ఉంటాయి. మొత్తాన్ని దానిలోని ఒక భాగం ద్వారా అర్థం చేసుకోవటం సాధ్యంకాదు. అందువల్లనే మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. మొత్తమంతా మనకెప్పుడూ కనిపించదు. ఆ మొత్తమంతా ఎలా ఉందో మనకు తెలియదు, ఎందుచేతనంటే, మనం ఎప్పుడూ ఒక భాగంతోనే వ్యవహరిస్తూ, తీరిక లేకుండా ఉంటాం. కాని, ఒక భాగం తన్నుతాను అనేకంగా విభజించుకుంటుంది. మొత్తమంతా తెలుసుకోవటానికీ, అనేకమైన వాటి మధ్య జరిగే సంఘర్షణని తెలుసుకోవటానికీ, కోరికని అర్ధం చేసుకోవాలి. కోరికది ఒకే చర్య - అది రకరకాలుగా ఒకదానికొకటి వ్యతిరేకంగా కోరుతూ కృషి చేస్తున్నప్పటికీ, అవన్నీ కోరిక నుంచి పుట్టినవే. కోరికని ఉన్నతమైనదిగా చూడటంగాని అణచి వెయ్యటం గాని చెయ్యకూడదు. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది అనేది లేకుండా అర్థం చేసుకునే రూపం ఒకటి ఉన్నట్లయితే అది కూడా కోరిక రూపమే. అనుభవం పొందేది లేకుండా అర్ధం అయినట్లయితే, అనేకం నుంచీ ఒక్కటినుంచీ కూడ స్వేచ్ఛ లభిస్తుంది.

అన్ని చర్యలూ - అనుగుణమైనవీ, నిరసించేవీ, విశ్లేషించేవీ, అంగీకరించేవీ. అన్నీ అనుభవం పొందే వాడిని. అంతే, అనుభోక్తను మరింత శక్తిమంతంగా చేస్తాయి. అనుభోక్త మొత్తమంతటినీ ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. కూడబెట్టుకున్నదంతా కలిసినది అనుభోక్త. గతం నీడలో ఏదీ అర్థం కాదు. గతం మీద ఆధారపడటం వల్ల ఏదైనా మార్గం స్ఫురించవచ్చు.