పుట:Mana-Jeevithalu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51. వైరుధ్యం

ఆయన బాగా పేరు పొందిన, బాగా నిలదొక్కుకున్న రాజకీయవేత్త. కొంత అహంకారం ఉన్నవాడు. అందువల్ల ఆయనకి అసహనం. ఉన్నత విద్య పొందినవాడు. ఆయన బాగా విచారించి, అతిమెల్లిగా వ్యక్తం చేస్తున్నాడు తన అభిప్రాయాలు. సూక్ష్మంగా సూచించటం ఆయనకి చేతకాదు. ఎందుకంటే ఆయనకి ఇతరులను మెప్పించే అలవాటుంది. ఆయనే ప్రజలు, ప్రభుత్వం, అధికారం. ఆయన ధారాళంగా ప్రసంగించగలడు. ధారాళంగా మాట్లాడటమే ఒక దురదృష్టం. ఆయన్ని ఎవ్వరూ అక్రమ పద్ధతిలోకి లాగలేరు. అందువల్లనే ప్రజల మీద ఆయన కంత ప్రభావం. అ గదిలో కూర్చోవటానికి ఆయనకి ఒక విధంగా అసౌకర్యంగా ఉంది. రాజకీయవేత్త ఎక్కడో దూరాన ఉన్నాడు. మనిషి ఇక్కడున్నాడు, మనఃకల్లోలంతో తన్ను తాను తెలుసుకుంటూ. ఆ దర్పం, దృఢవిశ్వాసం పోయాయి. తెలుసుకోవాలనే ఆదుర్దా, యోచనా, ఆత్మవివరణా ఉన్నాయి.

అపరాహ్ణపుటెండ, కిటికీ లోంచి వస్తోంది. అలాగే వీధిలో చప్పుళ్లు కూడా. పచ్చని కాంతి పుంజాల్లాటి చిలకలు రోజంతా బయటికి తిరగటం పూర్తి అయాక రాత్రికి పట్నంలో దారి పక్కల్నీ, తోటల్లోనూ ఉన్న పెద్ద చెట్ల మధ్య తలదాచుకోవటానికి తిరిగి వస్తున్నాయి. ఎగురుతూ, అ చిలకలు భీకరంగా కీచుమంటూ అరుస్తున్నాయి. ఒక వరుసలో తిన్నగా ఎగరవు - పడుతూ, లేస్తూ, పక్కలికి తిరుగుతూ, ఎగురుతున్నంత సేపూ గొడవగా కేకలేస్తూ ఉంటాయి. వాటి ఎగరటం తీరూ, వాటికేకలూ వాటి అందానికి విరుద్ధంగా ఉంది. దూరంగా సముద్రం మీద ఒకే ఒక్క ఓడ, తెల్లని తెరచాపతో ఉంది. గది చిన్న జనసమూహంతో నిండి ఉంది - వివిధ రకాల ఆలోచనల వైరుధ్యంతో. ఒక కుక్కపిల్ల లోపలికి వచ్చి ఇటూ అటూ చూసి వెళ్లిపోయింది, ఎవరూ గమనించకుండా. గుడిలో గంట మోగుతుంది.

"మన జీవితంలో వైరుధ్యం ఎందుకుంటుంది?" అని అడిగాడాయన. "మనం శాంతి, అహింస అనే ఆదర్శాల గురించి మాట్లాడుతూ ఉంటాం, కాని యుద్ధానికి పునాది వేస్తూ ఉంటాం. మనం యథార్థవాదులుగా