పుట:Mana-Jeevithalu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కావాలి గాని స్వాప్నికులుగా కాదు. మనకి శాంతి కావాలి. అయినా, దైనందిన కార్యకలాపాలు యుద్ధానికి దారితీస్తాయి. మనకి కాంతి కావాలి. అయినా మనం కిటికీ మూసేస్తాం. మన ఆలోచనా విధానమే వైరుధ్యం - కావాలి, వద్దు. ఈ వైరుధ్యం మన ప్రకృతి సిద్ధమే కావచ్చు. అందువల్ల దాన్ని ఐక్యం చేసి మొత్తం ఒకేలా చేయటానికి ప్రయత్నించటం వృథాయే అనిపిస్తుంది. ప్రేమ, ద్వేషం ఎప్పుడూ ఒకేచోట ఉన్నట్లు తోస్తుంది. ఈ వైరుధ్యం ఎందుకుంది? ఇది అనివార్యమా? దాన్ని తప్పించుకోవటానికి వీలుందా? నేటి ప్రభుత్వం శాంతి కోసమే ఉండటానికి వీలవుతుందా? అది ఒకేలా ఉండటానికి వీలవుతుందా? అది శాంతికోసం పని చెయ్యాలి, అయినా యుద్ధం కోసం సంసిద్ధం కావాలి. శాంతి అనే లక్ష్యాన్ని యుద్ధ సంసిద్ధతతో చేరుకోవాలి."

మనం ఒక నిశ్చితమైన లక్ష్యాన్నీ ఆదర్శాన్నీ ఎందుకు పెట్టుకుంటాం? దాన్నుంచి వైరుధ్యాన్ని ఎందుకు సృష్టిస్తాం? ఒక నిశ్చితాంశం, ఒక నిశ్చితాభిప్రాయం లేనట్లయితే వైరుధ్యమే ఉండదు. మనం స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసి, దానికి దూరంగా తిరుగుతూ ఉంటాం. దాన్నే వైరుధ్యం అంటున్నాం. ఒక నిశ్చితాభిప్రాయానికి అనేక వక్రమార్గాల ద్వారా, వివిధ స్థాయిల్లో చేరుకుంటాం. అటుపైన ఆ నిశ్చితాభిప్రాయానికీ, ఆదర్శానికీ అనుగుణంగా జీవించటానికి ప్రయత్నిస్తాం. అలా చెయ్యలేం కనుక ఒక వైరుధ్యం సృష్టింపబడుతుంది. ఇక, ఒకవైపున ఆ నిశ్చిత లక్ష్యానికి, ఆదర్శానికి, నిశ్చితాభిప్రాయానికీ, ఆలోచనకీ, మరోవైపున చర్యకీ వంతెన కట్టటానికి ప్రయత్నిస్తాం. ఈ వంతెన కట్టడాన్ని ఒకే రీతిలో ఉండటం అంటున్నాం. ఆ విధంగా ఒకే రీతిలో ఉన్నవాణ్ణి, తన నిశ్చితాభిప్రాయానికీ, తమ ఆదర్శానికీ కట్టుబడి ఉన్నవాణ్ణి ఎంత మెచ్చుకుంటాం? అటువంటి మనిషిని మహాత్ముడు అంటాం. కాని, పిచ్చివాళ్లు కూడా ఒకే రీతిలో ఉంటారు. వారి నిశ్చితాభిప్రాయాలకి వాళ్లూ కట్టుబడి ఉంటారు. తన్ను తాను నెపోలియన్ అనుకునే వాడిలో వైరుధ్యం ఉండదు. అతను తన నిశ్చితాభిప్రాయంలో మూర్తీభవిస్తాడు. తన ఆదర్శంతో తన్ను తాను ఐక్యం చేసుకున్న వాడు స్పష్టంగా మతి స్తిమితం లేని వాడే.

ఆదర్శం అని మనం పిలిచే ఆ నిశ్చితాభిప్రాయం ఏ స్థాయిలోనైనా