రుద్రాక్షల పై బొమ్మలు
రుద్రాక్షలనేవి ఒక చెట్టుకు కాచే కాయలు. వీటిని హిందువులంతా పరమ పవిత్రంగా భావిస్తుంటారు. వీటిలో ఏర్పడిన పలకను బట్టి ఏకముని, ద్వి ముఖి, త్రి ముఖి, పంచ ముఖి అని విభజించి, వాటి వాటికి అనేక విశేషాలు కూడా చెబుతుంటారు. ఎవరి నమ్మకం వారిది ! కాని ఈ బలహీనతను అసరాగా చేసుకొని కొందరు రుద్రాక్షల వంటి కొన్ని కాయలకు కృతిమమైన పలకలు సృష్టించి, సొమ్ముచేసు కొంటున్నారు.
ఈ రుద్రాక్షల్లో ఏకముఖి (ఒకే పలక గలది) చాలా విశేషమైనది. ఈ మధ్య ఇటువంటి రుద్రాక్షలు కోకొల్లలుగా వస్తున్నవి. విశేషమేమంటే ? వాటిపైన శివలింగం, పాము, త్రిశూలం లాంటి బొమ్మలు కూడా వుంటున్నవి. ఇలాంటి రుద్రాక్షలు ఈ మధ్య కాలంలో తప్ప పూర్వం వునట్లుగా ఆధారాలు లేవు. బాగా లావుగా వుండే అడవిరేగు గింజలను సంపాదించాలి. వాటిని నీటియందు రెండు రోజుల నానబెట్టిన తరువాత బాగా ఉడికించి [ఉడికే సమయంలో కొంచెం రెడ్ కలర్ కలపాలి]. వాటిని తీసి - తమకే విధమైన బొమ్మలు కావాలో అ విధమైన 'డై'ని తయారుచేయించి, వీటిలో ఈ గింజలు బెట్టి ప్రెస్ చేసిన తరువాత వాటిని ఎండబెట్టాలి, అప్పుడివి రుద్రాక్షలవలె యెర్రగా వుండుటమేగాక 'డై' ప్రభావం వల్ల గుబ్బలు, పలకలు, బొమ్మకూడా గలిగి వుంటవి.