Jump to content

పుట:Mahendrajalam.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షణంలో చెట్లు మొలకెత్తుట

ఏ చెట్టుయొక్క విత్తులనైనా సరే - ముందుగా ఊడుగగింజల నూనెలో కొన్ని రోజులు బాగా నానబెట్టిన తరువాత ఎండించి, భద్రపరచి వుంచుకోవాలి. ప్రదర్శన వేళలో ఏ చెట్టును మొలిపించదలచిన దాని విత్తులను మెత్తటి మట్టిలో వేడి నీళ్ళు చల్లిన యెడల కొద్ది నిమిషాలలోనే ఆ చెట్టు మొలకెత్తి ఏపుగా పెరిగి ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని గావిస్తుండగలదు.

పిండిబొమ్మ కదుల్తుంది

మంత్రగాళ్ళ టక్కరి మాయాజాలంలో ఇది ఒక భాగం. పిండితో బొమ్మనుచేసి దానికి పసుపు - కుంకుమతో అలంకారాలు చేసి - ఒక పల్చటి ఇనుప పాత్రలో పెట్టి వుంచాలి. కొంచెంసేపు (దొంగ) జపం చేసినట్టునటించి, అరచేతిని దానికి కొంచెం సమీపంలో వుంచి - "కదులు! రావే!" అంటూ చేతిని తనవైపునకు నెమ్మదిగా లాగుతూవుంటే ఆ బొమ్మకూడా పాత్రతోసహా ముందుకు నడిచివస్తుంది. అసలు కారణమేమిటంటే అధికశక్తిగల అయస్కాంతపు ఉంగరాలు ప్రదర్శకుడి చేతి వ్రేళ్ళకు వుండి, అవి బొమ్మగల ఇనుప పాత్రను ఆకర్షించటంవల్ల అలా జరుగుతుంది. కానీ చూచేవారికి విషయం తెలీక నిజంగా మంత్రంతో బొమ్మ కదిలిందని భావించి, దిగ్ర్బాంతి జెందుతారు.