పుట:MaharshulaCharitraluVol6.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

వ్యాఘ్రపాదమహర్షి

పూర్వము కృతయుగమున మహాతపశ్శాలియు, వేద వేదాంగి విదుఁడును, ధర్మప్రవచనదక్షుఁడు నగునొక మహాముని యుండెను. ఆతఁడు కామక్రోధమదమాత్సర్యాదు లనుజంతువులయెడ భయంకర వ్యాఘ్రమువలెఁ జరించువాఁడు. అందుచే నాతనికి వ్యాఘ్రుఁ డను పేరు కలిగెను. అంతేకాక, ఆతనిపాదములు వ్యాఘ్రపాదములవలె నుండుటచేత నాతఁడు వ్యాఘ్రపాదుఁ డనియుఁ బేరందెను.

వివాహము

వ్యాఘ్రపాదుఁడు యుక్తవయస్సు రాఁగానే తపశ్శూరుఁడు, అధ్యయనశీలుఁడు, శమదమాదిగుణాన్వితుఁడు నయి యొకమునికన్యకను వివాహమాడి గృహస్థధర్మములను నిర్వర్తింపఁ గడంగెను. గృహస్థాశ్రమమున నాతఁడు యజనయాజనాధ్యయనాధ్యావనముల తోడను, అప్రతిగ్రహవ్రత పాలనముతోడను కాలము గడపుచుండెను.

సంతానము

ఇట్లుండ నాతని ధర్మపత్ని యాతనిదయకుఁ బాత్రురాలై తొలి చూలున ఉపమన్యు వను కుమారుని, మలిచూలున ధౌమ్యుఁ డనుకుమారుని గాంచి వారి నల్లారుముద్దుగాఁ బెంచుకొనుచుండెను. వారు బాల్యముననే తల్లి యనుమతిం గొని పరమేశ్వరుని గుఱించి ఘోరతప మొనరించి యాతనిం బ్రత్యక్షము చేసికొనిరి. పరమశివు కరుణ వడసి ఉపమన్యువు మహాజ్ఞాని మహాయోగి యయ్యెను. ధౌమ్యుఁడు మహర్షియై పాండవ పురోహితుఁ డయ్యెను.