పుట:MaharshulaCharitraluVol6.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

మహర్షుల చరిత్రలు


మృతియు; మరుద్వతీశ్వర దర్శనమునఁ బునర్జన్మరాహిత్యము సిద్ధించును.

అట్లు కాశిని సేవించి మృకండుమాతలు వృద్ద లగుటమణికర్ణికా తీర్థమున మాధ్యాహ్ని కస్నానము లాచరించి శ్రీవిశ్వేశ్వరాలయమున కేగి ప్రదక్షిణము లొనర్చుచుఁ గన్నులు తిరుగ నేలపైఁ బడిపోయిరి. అపుడు విశ్వేశ్వరుఁడు వారికర్ణములఁ బ్రణవమంత్రమును జపింపఁగా వారు తనువులు వీడి కైలాసమునకేగిరి.

మృకండుఁడు మాతలకు శ్రద్ధాభక్తులతో నూర్ధ్వదై హికక్రియ లాచరించి తన భార్యతో నచ్చటనే యుండిపోయెను. అట నాతఁడు దినదినము గంగాస్నానము, విశ్వేశ్వరసేవ యొనరించుచుండ కాశీశున కాతనిపైఁ గరుణగలిగి వలసినవర మొక్కటి కోరుకొమ్మనెను. అతఁడు విశ్వేశ్వరునకు మ్రొక్కి యొక్క పుత్రు నిమ్మని ప్రార్థించెను. అంత శివుఁడు షోడశవర్షములు మాత్రమే బ్రదుకు సత్పుత్రుఁడు కావలయునా లేక చిరకాలజీవియగు దుష్పత్రుఁడు కావలయునా యని యడిగెను. మృకండుఁ డప్పుడు షోడశసంవత్సరజీవి యైనను సత్పుత్త్రుఁడే కావలయు నని కోరుకొనెను. విశ్వనాథుఁ డాతనికిఁ గోరిన వర మిచ్చి యదృశ్యుఁ డయ్యెను.

తరువాత మరుద్వతి మృకండుని కతమున గర్భముధరించి నవమాసములు మోసి యొక్క పుత్రునిం గనియెను. ఇతఁడే మార్కండేయ మహర్షి. ఈతఁడు తరువాత మృత్యువును జయించి సర్వలోకారాధ్యుఁడు చిరంజీవి యయ్యెను. ఈ విధముగ జగద్విఖ్యాతి గాంచిన మార్కండేయమహర్షి మృగశృంగమహర్షి పౌత్రుఁడు.