పుట:MaharshulaCharitraluVol6.djvu/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

మహర్షుల చరిత్రలు


టకు బ్రాహ్మణునిచేత నుదకధార విడిచి గోదానము చేయవలయును. శిష్యుఁడు, వ్రతశీలుఁడు-శాంతుఁడు, దాంతుఁడు, అక్రోధనుఁడు నగు.. విప్రుఁడే యిందులకుఁ బాత్రుఁడు. ఇట్టి దానముఁ జేసినవాఁడు చంద్రలోకమున సకలసౌఖ్యములు చిరకాల మనుభవించును. ఆశ్వయుజ మాసమున బహుళాష్టమి మొదలు మూఁడుదినము లుపవసించి పుణ్యమగుపసులసాల నుండి గోమూత్రము, గోమయము గ్రహించి సమస్త కామ్యసిద్ధిని పొందును. "

ఇది విని మాంధాత య ట్లనేకగోదానము లొనరించి యుభయ లోకములందు శాశ్వతకీ ర్తిచంద్రికల నింపెను.*[1]

బృహస్పతి మనువునకుఁ జేసిన జ్ఞానబోధ

ఒకప్పుడు మనువు తనగురువగు బృహస్పతిని జేరి కొలిచి తనకు జ్ఞానయోగముఁ దెలుపు మని ప్రార్థించెను. బృహస్పతి యిట్లు బోధించెను. "అనఘా! సత్కర్మయోగనిష్ఠ జ్ఞానయోగమునకుఁ గారణము. అనిష్టమును పాపుకొనుటకు, ఇష్టమును సంపాదించుకొనుటకు మానవుఁడు కర్మ మొనరించును. నిజమునకు, ఇపు డేవి సుఖములో అవియే కొంతకాలమునకు దుఃఖదాయకము లగును. ఇది తెలిసికొన్న ప్రాజ్ఞుఁడు ఫలవిషయమున నపేక్షలేనివాఁడై సుఖదుఃఖముల కతీతుఁడై కామాదులకుఁ గడుదవ్వగు జ్ఞానవిశేష బుద్ధివలనఁ బరమసిద్ది నందును.

మఱియు, పరమవస్తువు ఆలంబము లేనిది; శబ్దస్పర్శరూపరసగంధవిరహితము. అందుచే నది వ్యాప్త మగుచుండునింద్రియములకు వశపడదు. పరతత్త్వమునకు స్త్రీ పుం నపుంసకత్వములు లేవు. అందుచే నది వానివానివ్యాపారముల కతీతమై దేహగత మయ్యు బోధరూపమున దీపించును. వెలుఁగుచున్న దీప మితరవస్తువులఁ బ్రకాశింపఁ జేయునట్లు మహోత్తమమగు నిత్యబోధనజ్యోతి తనప్రభవలన నింద్రియమానసముల దోషములఁ బోఁ గొట్టును. రాజునకు మంత్రులాయా కార్యముల నెట్లు సూచింతురో, అట్లే పురుషున కింద్రియములు క్రియలఁ

  1. *భారతము, అనుశాసనిక పర్వము.