పుట:Maharshula-Charitralu.firstpart.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

మహర్షుల చరిత్రలు


బాలుని కొకగోవు నిమ్మని రోమపాదునిఁ గోరెను. అంత నాతఁడు బ్రాహ్మణులు దురాశాపరు లని నిందించెను. ఒక్కగోవు నిచ్చుటకు బదులు సద్ద్విజజాతిని బుద్ధిపూర్వకముగాఁ దెగడిన యా రాజును దండ్రికొమరు లిరువురును గోపించి యంగ రాజ్యము దుర్భిక్షమై యనావృష్ఠిదోష మందుఁగాక యని శపించి యారాజ్యము నుండి వెడలిపోయిరి. తరువాత రోమపాదుఁడు పశ్చాత్తప్తుఁడై గత్యంతర మే మని మిగిలిన బ్రాహ్మణుల నడుగఁగా వారు ఋష్యశృంగుని చరిత్రము వినిపించి యాతఁ డిటకు వచ్చిన నీ యపగ్రహదోషము వాయు నని చెప్పిరి. పిమ్మట రోమపాదుఁ డా బ్రాహ్మణులను బూజించి వారి యనుమతిని గొందఱు వారాంగనఁను సర్వకలాపూర్ణ యను నామె యాధిపత్యమున ఋష్యశృంగునిఁ దోడ్కొని రాఁబంపెను.

సర్వకలాపూర్ణాదివేశ్యలు ఋష్యశృంగుని గొనిపోవుట

నవయౌవనలు నతివిలాసినులు నగు నా వారాంగనలు విభాండకుఁ డాశ్రమమున లేని తరుణమున ఋష్యశృంగునిపాలి కరుదెంచిరి. స్త్రీముఖము చూచి యెఱుఁగవి ఋష్యశృంగుఁడు వారలు మునికుమారు లని యెంచి యర్ఘ్యపాద్యాదులీయ వారు స్వీకరింపక తాము తెచ్చిన దివ్యగంధ మాల్యములు సరసభక్ష్యములు విచిత్ర వస్త్రములు నిచ్చిరి. వారు పిమ్మటఁ దమ నృత్యగీతముల నాతని నానందింపఁజేసి వానిఁ గౌఁగిలింతల నొడలివుడికిళ్ళ మోసపుచ్చి తమ యాశ్రమము సమీపముననే యున్న దనియు నందుఁ దపముచేయ రమ్మనియు నాహ్వానించిరి. పిమ్మట వారు విభాండకునకు భయమొంది నాఁటికి వెడలిపోయిరి. ఋష్యశృంగుఁడు తండ్రిచెప్పిన యగ్ని హోత్రము వేల్వ మఱచి వారి యొప్పునఁదగిలి వారితోఁ దపముచేయ నాసక్తుఁడై యుండెను. ఇంతలో విభాండకుఁడు వచ్చి సుతు నగ్నిహోత్రము వేల్వకుండుటకుఁ గారణ మడిగెను. ఆతఁ