పుట:Maharshula-Charitralu.firstpart.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

మహర్షుల చరిత్రలు


వైకుంఠపురమున నిజభవనమును జూపి “వత్సా! ఈ చరాచరము జలరూపమున నావరించి వరుణాభిధేయుఁడ నగు నారాయణుఁడను నేనే. నీవు మద్భక్తుఁడ వగుట దీనిని గంటివి ఏతద్దర్శన ఫలముకతన నీ కేకాలమునను జేటు లేదు. "పొ" మ్మని వీడ్కొలుపుటను దెలిపి వాని నాశ్చర్యమగ్ను నొనర్చెను [1]

"అగస్త్యగీత:" " ఆగస్త్య సంహిత."

అగస్త్యమహర్షి లోకోత్తరపురుషుఁడై యాజీవితాంతము జగద్ధితమునకై పాటుపడినవిశ్వశ్రేయస్కరుఁడు. మహాభారతమందలి శాంతిపర్వమున వెలయు నీతని ప్రసిద్ధ మహా విద్యాబోధనయే యగస్త్య గితానామమునఁ జిరస్థాయియై నిల్చినది. మఱియు, నీ మహర్షి రామచంద్ర విష్ణునామవాద్యవతార పూజావిధానము శాస్త్రోక్తముగాఁ దెలిపియుండెను. ఇదియే "యగస్త్యసంహిత " యనఁ బరగుచున్నది. [2]

అగస్త్యమహర్షి జీవితమంతయుఁ బ్రసిద్ధ బ్రహ్మవిద్యాబోధకమే యైయున్నది. ఈతని తత్త్వసారమంతయు;

"శివుఁడే దాత శివుండె భోక్త శివుఁడే
 చేయున్ మఖాదిక్రియల్
 శివుఁడే విశ్వము నే శివుండ ....."

నను నద్భుతాద్వైతానుసంథానమునఁ బ్రవ్యక్తమైన దనఁ జెల్లును. సతీసహితుఁడై సమస్తతీర్థములఁ గ్రుంకివచ్చి యగస్త్యమహర్షి దేహశుద్ధికి యమనియమాదులకు నవి యవసరములే యైనను :

"తీర్థములుమాననములు ముక్తిప్రదములు"
"బాహ్యతీర్థావళులు ముక్తిఫలము నీవు"

అని తన సాధ్వీమణికిఁ దీర్థపరమార్ధమును వెల్లడించినాఁడు.

  1. వరాహ పురాణము.
  2. సంస్కృత వాచస్పత్యము