పుట:Maharshula-Charitralu.firstpart.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

29


విమానమున శతమహాసంఖ్యగల యక్షరాక్షస బలములతో ప్రియసఖుఁడైన మణిమంతుఁ డనువానితోఁ గూడి యాకాశమార్గమునఁ బోవుచుండెను. దారిలో యమునానది గలచోట నాకసమునఁ బోవు విమానమునుండి మణిమంతుఁ డుమ్మివైచెను. అది యమునానది తీరమున నూర్ధ్వబాహుఁడై యుగ్రతపము చేయుచున్న యగస్త్యుని పైఁ బడెను. అగస్త్యుఁడు వెంటనే విమాన మాఁపుచేయ దిగివచ్చి నమస్కరించిన కుబేరుని జూచి 'మూర్కుఁడగు నీ మిత్రుఁడు నా పై నుమిసెఁ గావున నాతఁడొక్క మానవునిచేతఁ జచ్చు. అతని పరీవారమైన యీ యక్షరాక్షసగణములెల్ల నా నరునిచేతనే చచ్చు'నని శపించి పొండనెను. కుబేర మణిమంతు లగస్త్యుని గటాక్షింపు మని ప్రార్థించి సెలవు గైకొని పోయిరి. ఈ యగస్త్య శాపముకతముననే సౌగంధిక వ్రసవాపహరణ సమయమున మణిమంతుఁడు నాతని పరివారము భీమసేనుని చేతిలోఁ జచ్చిరి.[1]

అగస్త్యుడు భద్రాశ్వు నను గ్రహించుట

కృతయుగమున నవవర్షములలో నొకవర్షమునకుఁ దనపేర భద్రాశ్వనామధేయంబుఁ గల్పించిన భద్రాశ్వుఁ డను రాజు నిజ భార్యయగు కాంతిమతీదేవితో నుండ సగస్త్య మహర్షి యేతెంచి యాతనిచే నేన్నో మన్నన లంది పద్మనాభ వ్రత సంబంధ మగు దీప మాలికలం గాంచిన ఫలమున వా రా జన్మమున నంత యైశ్వర్యము గాంచిరని వారి పూర్వజన్మ వృత్తాంతమును దెలిపి వారి కేతద్ర్వత విధానమును బోధించి యనుగ్రహించెను.

మఱికొంత కాలమున కాతఁడు పుష్కరతీర్థమున కేఁగి కుమారస్వామిని భజించి వచ్చి భద్రాశ్వునకు మఱికొన్ని వృత్తములఁ దెలిపెను. అందిలావృతవర్షమున నున్నతఱిఁ దనకు నారాయణుఁడు

  1. భారతము - ఆరణ్యపర్వము.