పుట:Maharshula-Charitralu.firstpart.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



అవతారిక

"నమ ఋషిభ్యో మంత్రకృద్యో మంత్రపతిభ్యో
 మామామృషయో మంత్ర కృతో మంత్ర కృతో మంత్రపతయేః షరా
 దుర్మాహ మృషీ న్మంత్రకృతో మంత్రపతీన్పరాదాం "

“మంత్రద్రష్టలు మంత్రపతులు నగు మహర్షులకు నమస్కారము, వారు నన్ను విడువకుందురుగాక ! నేను వారిని విడువకుందునుగాక!"

- కృష్ణయజుర్వేదము.

భారతదేశమున జన్మించిన ప్రతివ్యక్తికిని బరమపావనులగు భారతమహర్షులు త్రికాలస్మరణీయులు, భుక్తిముక్తి ప్రదాతలు. ఆధ్యాత్మి కౌన్నత్యమున, జ్ఞానప్రకాశమున, విజ్ఞానవిశేషమున. ధర్మ ప్రవచనమున, సర్వవిషయములందును భారతవర్షమునకేకాక యావత్ప్రపంచమునకును భారత మహర్షులే భిక్షాప్రదాతలు. విశ్వసంసృష్టికిని దత్సుస్థితికినీ వారె కారణభూతులు, అట్టి మహర్షుల సంతటిని జనించుటచేతనే భారతీయుఁడు విశిష్టసౌభాగ్య విలసితుఁడై విఱ్ఱవీఁగుట కధికారము గడించియున్నాఁడు. ఆ మహర్షుల పవిత్రాశీర్వచన బలముచేతనే నాఁటికిని నేఁటికిని నింక నేనాఁటికిని జ్ఞానతేజమును బ్రసరింపఁజేయుట కొక్క భారతీయుఁడే యర్హుఁడై యున్నాడు. ప్రపంచగురుత్వము వహించుట కాతఁడే నమర్థుఁడు. అజ్ఞానాంధకారబంధుర మగు పాశ్చాత్య ప్రపంచము విజ్ఞాన ప్రదీపమునకు భారతమహర్షులనే యాశ్రయింపక తప్పదు.

అట్టి మహామహులగు మహర్షుల జీవిత విశేషము లెఱుఁగుటకు వారి నాదర్శముగాఁ గైకొనుటకుఁ గుతూహల పడని భారతీయుఁ డుండఁడు. కాని వారి జీవితవిశేషము లేకముఖముగా నొకేచోటఁ గాక వివిధ పురాణాంతర్గతములై జిజ్ఞాసువుల కలభ్యము లగుచున్న వి.