పుట:Maharshula-Charitralu.firstpart.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిమహర్షుల చరిత్రలు

అగస్త్య మహర్షి

శ్రీమంత మగు భరతఖండము పుణ్యతపోనిలయము. కావుననే పరమ పవిత్రము. ఇందు జన్మించి తపో మహిమచే సృష్టి స్థితి లయకారులైన వారే మహర్షులు. వీరు విశ్వ సంరక్షణమునకై త్రిమూర్తుల కృత్యములు నిర్వహింప సమర్ధులగుటేకాక త్రిమూర్తులకు నార్తిసమయముల నుద్దారకులు సంరక్షకులు నైన పరాత్పరులు. ఇట్టి మహామహులఁ గని యుండుటచేతనే భారతవర్ష మార్ష భారతమనియు నార్యా వర్తమనియు విఖ్యాతి గడించెను.

ఇట్టి పరమపవిత్రవర్తనులు బ్రహ్మవిద్యానవద్యులు పరమేశ్వర కల్పులు నగు భారత బ్రహ్మర్షులలో నగస్త్యమహర్షి యగ్రేసరుఁడు. ఈతఁడు వసిష్ఠమహర్షికి సహజన్ముఁడు. త్రికాల వేది. భక్తిజ్ఞానయోగవిరాగనిధి, గృహస్థరత్నము. ఈ పరమ పురుషుని జన్మకథ కడుఁ జిత్రమైనది. మహాపురుషులయు, మహానదులయు జన్మగాథలు చిత్రాతిచిత్రములే కదా!

అగస్త్యుని జన్మకథ

తొల్లి మహేంద్రుఁడు. దేవతలను బాధించుతారకాదులగు రాక్షసులను జంపవలసినదని అగ్నికి వాయుదేవునకు నాజ్ఞాపించెను. వాయువు సాయమున అగ్ని రాక్షసుల నెల్లరి నిశ్శేషముగా నాశనము చేయుచుండెను. అంత, వారు భయపడి సముద్రముఁ జొచ్చిరి. వారి బాధ తొలఁగినదికదా యని అగ్ని వాయువులు ఉపేక్షభావమున నుండిరి.