పుట:Maharshula-Charitralu.firstpart.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మహర్షుల చరిత్రలు

కాని, కొంతకాలమైన పిదప రాక్షసులు రాత్రి సమయములందు వచ్చి దేవతలను, మునులను, మానవులను నానావిధముల బాధించి పోయి పగటివేళల సముద్రములో దాఁగికొనుచుండిరి. ఇట్లు పండ్రెండువేల సంవత్సరములు రాక్షసులు ప్రవర్తించి పెక్కండ్ర నుక్కడించిరి. దాన లోకోపద్రవ మేర్పడెను.

మహేంద్రుఁడు మండిపడి అగ్నివాయువులఁ బిలిపించి “అగ్నిహోత్రా! వాయుదేవా! తారాకాది రాక్షసులను జంపుఁడని మీకు నేను విధించితిని. మీరు వారిని జంపక విడుచుటవలన లోకమున కింతకీడు మూడినది. గతజల సేతుబంధసము వలదు. ఇప్పుడైన మీరు సముద్రు నింకించి యందు దాఁగియున్న యా రాక్షసులను, భస్మము చేయుఁ” డని యాజ్ఞాపించెను.

అందులకు వారు “దేవేంద్రా! సముద్రము నెండఁబెట్టుటవలన, అందు జీవించు అనంతమైన జీవరాశి నశించును. అది మహాదోషము. కావున రాక్షస నాశనమునకు మఱియొక యుపాయ మూహింపు”మని కోరిరి. ఇంద్రుఁ డందులకు వారిపైఁ గోపించి “ఏమేమి? నాయాజ్ఞ ధిక్కరించి మేర మీరుదురా? కానిండు. దానికి ఫలిత మనుభవింపుఁడు. మీ రిరువురు భూమిపై నొక యచేతన పదార్థమునుండి మునులై పుట్టుఁ” డని శపించెను,

ఆ పిమ్మట విష్ణుమూర్తి ధర్ముని సుతులగు నరనారాయణుల యవతారమెత్తి గంధమాదన పర్వతమున నుగ్రతప మొనరించు చుండెను. ఆ నరనారాయణుల అపూర్వ తపో వైభవమున కసూయపడి యింద్రుఁడు తత్తపోవిఘ్నముఁ గలిగింపుఁ డని మన్మథవసంతుల కాజ్ఞాపించెను. మహేంద్రునాజ్ఞ నౌదలధరించి వారిరువురు ఎక్కు రప్సరసలను దీసికొని వెళ్ళి తమ కళానైపుణ్యముఁ బ్రకటించి నరనారాయణులనుఁ దపోభంగ మొనరించిరి. అంత నారాయణుఁ డెంతయు