పుట:Maharshula-Charitralu.firstpart.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుర్వాసో మహర్షి

147


దుర్వాసుఁడు ముద్గలువ కతిథియగుట

తొల్లి ముద్గలమహర్షి యుంఛవృత్తి నవలంబించి మహోత్తమ తప మొనరించుచుండఁగా నాతని చిత్తశుద్ధిఁ బరీక్షించి యాతనికి మహోపకృతిఁ గావింపఁ దలఁచి దుర్వాసుఁ డాతని యింటి కతిథిగా నేఁగెను. పక్షోపవాసములు చేయు ముద్గలుఁడు సకుటుంబముగా నాతనిని గౌరవించి తాము తినుట మాని యామునివరుని కన్నము పెట్టి గౌరవించెను దుర్వాసుఁ డంతయన్నముఁ దిని మిగిలిన దాని నొంటినిండఁ బాముకొని పోవువాఁడు. ఇట్లెన్ని మారులు వచ్చి చేసినను ముద్గలుఁడు కొంచెమైనఁ గోపింపక యామహర్షికి మహాసేవ చేసెను.

తుదకు దుర్వాసుఁడు ముద్గలుని మిక్కిలి స్తుతించి యాతనికి సశరీరస్వర్గసుఖము సమకూరు వర మొసంగి పోయెను. కాని, ముద్గలుఁడు స్వర్గమును దృణీకరించి బ్రహర్షి యై మోక్షమందెను[1]

దుర్వాసోమహర్షి కుంతీదేవికి వర మొసఁగుట

దుర్వాసోమహర్షి యొకసారి కుంతిభోజునియింటి కేఁగ నాతఁ డత్యంత భక్తి పూర్వకముగా నాతనికి సపర్య లొనర్పఁ గన్యయగు తనకొమార్తెఁ గుంతిని నియమించెను. కుంతియు నేమఱిపాటు లేక దుర్వాసుని హృదయము, కరఁగున ట్లాతనికిఁ బరిచర్యలొనర్చెను. దుర్వాసుఁడు కుంతిభోజు నాశీర్వదించి కుంతీదేవికి వర మనుగ్రహింతుఁ గోరుకొను మనఁగా నామె తన కొక మంత్ర ముపదేశింపు మనియు నామంత్రశక్తిచే నేదేవు నుపాసించిన నా దేవుని వలనఁ దన కొక పుత్త్రుఁడు గలుగవలె ననియుఁ గోరుకొనెను. దుర్వాసుఁ డట్లే యని యామె కొక మంత్ర ముపదేశించి వెడలిపోయెను. ఈ మంత్ర ప్రథానముననే కుంతికి సూర్యుఁడు ప్రత్యక్షమై కర్ణునొసఁ గెను.[2]

  1. భారతము - ఆరణ్యపర్వము.
  2. భారతము - ఆదిపర్వము.