పుట:Maharshula-Charitralu.firstpart.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

మహర్షుల చరిత్రలు


బూజించి తన కతిథి కమ్మని కోరెను. దుర్వాసుఁ డాతనిఁ బరీక్షింపఁ దలఁచి వల్లెయనెను. ఆఖిల్లుని చిత్తశుద్దికి మెచ్చి యాకాశవాణి యొకమణి పం పెను. దానివలన నెందఱో యువతు లుద్భవించి పంచభక్ష్యపరమాన్నములు సిద్ధముచేసిరి. శబరుఁడు దుర్వాసుని విందారగింప రమ్మని కోరెను. కాని, యాతఁడు తనకు జలములు కావలయు ననెను. శబర తాపసుఁడు దేవికానదిని బ్రార్థించి యామె దుర్వాసునికడకు వచ్చి ప్రవహించునట్లు చేసెను. దుర్వాసుఁ డానందించి యాయేటమునిఁగి వచ్చి యాతనివిం దారగించి దయామయుఁడై "ఓయీ! నీవు గురూపదేశమార్గమున సత్యం బవలంబించి తపంబు చేసితివి. ఇఁకనుండి నీవు సత్యతపుఁ డనుపేరఁ బరగుము. వేదశాస్త్ర పురాణాది వై శారద్యము నీకుఁ గలుగుఁగాక " యని వరమిచ్చెను.

అనంతరము దుర్వాసుఁ డాతని కిట్లుపదేశించెను. "ఓయీ! సుజ్ఞానమునఁగాని సత్కర్మము జరుగదు. సత్కర్మమునఁగాని విజ్ఞానము పొడమదు. ఆలోచింపఁగా నీ రెండును ఒక దాని కొకటి సాధనములు సత్కర్మములు జాతులఁబట్టి నాలుగువిధము లయ్యెను. కులధర్మము తప్పక బ్రహ్మోపాసకులైనవారు మోక్షమందుదురు. బ్రహ్మ మనఁగా భక్తరక్షాపరాయణుఁ డగు నారాయణుఁడు. ఆతఁడు యజ్ఞాది వైదిక క్రియలకు సులభుఁడు."

అమాటలు విని “మహాత్మా ! యజ్ఞాదికృత్యములు ధనసామగ్రి లేక నడపలేము. ధన మున్నను లోభమున సంసారు లాకార్యము లొనరింపరు. కావున. అల్పప్రయాస మాత్రమున సకలవర్ణముల వారికి మోక్షము గలుగు నుపాయముఁ దెల్పు" మని యాశబరుఁడు దుర్వాసుని గోరెను. అందుల కాతఁడు మహోత్తమఫలప్రదము లగు వ్రతముల నెన్నిటినో తెలిపి యవి యాచరించినచో నిహపర సౌఖ్యములు కలుగు నని యుపదేశించి యాతని నాశీర్వదించి వెడలి పోయెను. అవి యొనర్చి సత్యతపుఁడు తరించెను.[1]

  1. వరాహపురాణము