పుట:Maharshula-Charitralu.firstpart.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుర్వాసో మహర్షి

141


దుర్వాసుఁడు ధర్ముని శపించుట

తొల్లి దుర్వాసుఁడు సోదరుఁ డగు దత్తాత్రేయునితోఁ గలిసి ధర్మదేవతయొక్క నిజరూపమును జూడఁ దలఁపు కలిగి పెక్కు సంవత్సరములు మహాతపము చేసెను. నిరాహారులై పంచాగ్ని మధ్యమునను, జలమధ్యమునను నిలిచి వారు ఘోరతపము చేసినను, ధర్మ దేవత ప్రత్యక్షము కాఁదయ్యెను. తుదకు విసిగి వేసారి దుర్వాసుఁడు తనకుఁ బ్రత్యక్షముకాని ధర్మునిపై మిగులఁ గోపిఁచి శపింప నుద్యుక్తుఁ డయ్యెను. అంత ధర్మ దేవత బ్రాహ్మణరూపమును ధరించి సపరివారముగా విచ్చేసి యా మహర్షి సత్తముల యెదుట నిలఁబడెను. దుర్వాసుఁ డాతనివంకే చూడక శాపాక్షరములు విడువఁ దలఁచుచుండెను. "ఓయీ! తపస్వులకుఁ గోపము పనికి వచ్చునా? క్రోధాధులకుఁ దపఃఫలము దవ్వగును గదా!" అని ధర్మువు దుర్వాసునితో ననెను. దుర్వాసుఁడు కోపముతో "ఓరీ! ముందు నీ వెవఁడవో చెప్పుము. నీతో వచ్చిన యీ పరివార మెవరో తెల్పుము. పిదప, నాకుఁ గ్రోధము తగునో తగదో నేనే చెప్పెదను" అని పల్కెను. అంత నావిప్రుఁడు "మునీంద్రా ! బ్రహ్మచర్యము, సత్యము, తపము, దానము, దమము, నియతి, శౌచమ, క్షమ, . శాంతి. ప్రజ్ఞ, అహింస, శ్రద్ధ, మేధ ,దయ అను గుణముల పుంస్త్రీరూపములు వీరు. వీరు నా పరివారము నేను ధర్మదేవుఁడను. నీ కోపముఁ బాప వచ్చితి" మని చెప్పెను. దుర్వాసుఁడు శాంతింపక "ఓయీ! పదివేలేండ్లు కడచిన పిదప నిప్పుడు నీ కంటికి మేము కనఁబడితిమా ! ఇప్పుడై నను, నా శాపమునకు నీవు భయపడి వచ్చితివి కాని, నీ యోగ్యతచేఁ గాదు. బ్రాహ్మణక్రోధ మమోఘము. నిన్ను శపింపక మానను. నీవు సుఖ మెఱుఁగని రాజువుగను, దాసీపుత్త్రుఁడవు గను, చండాలుఁడవుగను జన్మింపు" మని మూఁడు శాపము లిచ్చెను.

ధర్మువు చేయునది లేక ఋషిశాప మంది పిదఁ దనయొక యంశమున యుధిష్ఠిరుఁడుగను మఱియొక యంశమున విదురుఁడుగను,