పుట:Maharshula-Charitralu.firstpart.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

మహర్షుల చరిత్రలు


యాదేశించెను. భర్త యానతి యందలి యంతరార్థమును గ్రహించి వెంటనే యాశ్వినులకడ కరుదెంచి యామె తనకు నవయౌవను నొకనిఁ దెండని కోరుకొనెను. వారు బ్రహ్మానందము నంది సమీపమునఁ గల కొలనులో దిగుసరికి నవయౌవనులైరి. చ్యవనుఁ డది చూచి తాను నందు దిగి నవయౌవనుఁడై వారితో పాటు సుకన్యకడ కరుదెంచెను. మహాపాతివ్రత్య ముట్టిపడ సమానరూప వయోవిలాసముల నొప్పు నామువ్వురిలో నామె చ్యవనునే వరించెను అశ్విను లానందించి యామె పవిత్రపాతివ్రత్యము నభినందించి యామెను బరీక్షించుటకే యట్లోనర్చితి మనిచెప్పిరి.[1]

చ్యవనుఁ డాశ్వినులను సోమపీథులఁ జేయుట

చ్యవనుఁడు తన కశ్వనీ పుత్త్రుల మూలమున నూత్న యౌవనము లభించినకారణమున వారికిఁ దాను బత్యుపకారము చేయ నెంచెను. అంతవఱ కశ్వినీ కుమారులకు సోమపానము చేయనర్హత లేదు. ఆకారణమున నాశ్వినీ దేవతలను సోమపీథులఁ జేసెద నని ప్రతిజ్ఞ చేసి చ్యవనుఁడు "వారిని బంపివేసెను. చ్యవనుఁడు తన నూత్న యౌవనమును జూచి యానందించుటకు సపరివారముగా వచ్చియున్న సంయాతని గాంచి యాతని యభ్యున్నతి కొకక్రతువును దా నాతనిచేఁ జేయించుటకు నిశ్చయించెను. సంయాతి వల్లె యని నగరమున కరిగి యజ్ఞ సంభారములను సమకూర్చెను. చ్యవనమహర్షి సుకన్యాసహితుఁడై శ్వశురగృహమున కేఁగెను. అంత సుముహూర్తముస విద్యుక్తముగ సంయాతి చ్యవనుని యార్త్విజ్యమున యజ్ఞ మారంభించెను. ఇంద్రాది దేవతలు హవిర్భాగమున కాహూతులై మఖమునకు వచ్చి

యుండిరి. చ్యవనమహర్షి తాను గావించియున్న వాగ్దానము ననుసరించి యాశ్వినులకు సోమ మీయఁబోఁగానే యింద్రుఁడు కోపించి యాశ్వినేయులు బృందారకులు కాని కారణమున వారికి సోమ

  1. భారతము - అరణ్యపర్వము, దేవీభాగవతము.