పుట:Maharshula-Charitralu.firstpart.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్యవన మహర్షి

103


మీయవలదని నివారించెను. చ్యవనమహర్షి యాతనిమాటలు పాటి సేయక యాశ్వినేయులను సోమపీథులఁ జేసెను.

చ్యవనుఁ డింద్రునకు గర్వభంగము చేయుట

అంతఁ దనమాట నిర్లక్ష్యమగుటఁ గాంచి యింద్రుఁ డలిగి వజ్రాయుధ మెత్తి చ్యవనునిపై వేయఁబూనెను. చ్యవనుఁ డింద్రుని హస్తమెత్తినది యెత్తినట్లే యుండఁ జేసి యాతనిని వజ్రాయుధముతో పాటు రూపఱఁ జేయ నగ్నియందు వేల్వఁగా నందుండి యపారఘోరబలుఁడు మహాజీవుఁడు నయి మదుఁడను రాక్షసుఁడు భీకరాకారుఁడై యుద్భవించెను. అతనిచేతులు పదివేల యోజనముల పొడువుండెను. అంతకుఁ దగిన నాలుగుదంష్ట్రలును సూర్య చంద్రులఁ బోలు కన్నులును గాలాగ్ని వంటి నోరును భూమ్యాకాశముల నంటు శరీరమును గలిగి యొక్కసారిగా నోరుదెఱచి నాలుకతో బెదవులు నాఁకుకొనుచు మహానాదముతో నింద్రుని మింగవచ్చు నారాక్షసునిఁ జూచి యింద్రుఁడు భయకంపితుఁడై తన తప్పిదముమ క్షమింపుమని నాఁటినుండియు నాశ్వినీ దేవతలు సోమపీథులే యగుదురని పలికి చ్యవనుని పాదములపైఁ బడెను. చ్యవనమహర్షి యాతని కభయమిచ్చి యా రాక్షసుని నివారించెను. మదుఁడు చ్యవనునకు సమస్కరించి తన కాశ్రయమును జూపుమని వేఁడుకొని నాఁటినుండి యాతని మద్యస్త్రీ మృగయాక్షముల నాశ్రయింపుమని చ్యవనుఁ డాదేశించుట తోడనే యారాక్షసుఁ డంతర్థానమాయెను. ఇంద్రుఁడును బ్రతుకు జీవుఁడా యని స్వర్గమనుఁ డయ్యెను. ఈ ప్రకారము తనకృతజ్ఞతను వెలిపుచ్చుకొన్న చ్యవను ననేకవిధముల నభినందించి యాశ్విన్యాది దేవతలు హవిర్బాగసంతృప్తిఁ దమలోకమునఁ కేఁగిరి. చ్యవనమహర్షి తన తపఃప్రభావమును వెల్లడి చేసిన కారణమున నా పర్వతము 'ఆర్చీకపర్వత' మను పేరఁ బరిగి ప్రసిద్ధిగాంచెను.[1]

  1. భారతము, ఆరణ్యపర్వము, అనుశాసనికపర్వము