పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

మహాపురుషుల జీవితములు

పురుషునిమీఁద నిలిచియుండలేదు గావున నది సర్వకాలములయందు సర్వదేశములయందు సకలజాతులవారికి నవలంబనీయమనియు నతఁడు బోధించెను.

పీఠములమీఁద నెక్కి మనకుగురుస్వాములమని చెప్పుకొనుచు సన్యాసులయ్యు జమీందారులకంటె నెక్కువభోగముల ననుభవించు మతగురువులు నశించునప్పుడుగాని మన దేశ మభివృద్ధి పొందదని యాయన పలుచోట్ల నొక్కి చెప్పెను. వేదాంతవిద్య జాతిభేదము లేక సకలజనులకు నుపదేశింప, దగినదనియును చండాలాది నీచజాతులకు గూడ విద్యాబుద్ధులు చెప్పి బాగుచేయవలసిన భారము మనమీఁద నున్నదనియు నీచజాతులు హీనస్థితిలో నుండుటచేతను మన దేశము చెడిపోయిన దనియుఁ గావున వారిస్థితిని జక్కఁజేయుటకు మనమందఱము పాటుపడవలసినదనియు వివేకానందస్వామి యనేకొపన్యాసములలో ప్రసంగించుచు వచ్చెను. అంతియగాక తాను చనిపోవు లోపుగ పదిమంది మాలవాండ్రనయిన నుత్తమబ్రాహ్మణులుగఁజేసి మృతి నొందుదునని చెప్పెను. కాని యీకార్యము నెరవేరక ముందే యాయన మృతిపొందెను. తక్కువజాతులవారి నున్నతస్థితికి దెచ్చుట కీయన కిష్టమే. ఆవిషయమున నొక యుపన్యాసమందాయన యిట్లు చెప్పియున్నారు. "బ్రాహ్మణులు మొదలగు నగ్రవర్ణములవారు తమ యాచార వ్యవహారములు వదలుకొని తక్కువ జాతులలో కలియగూడదు. కాని మాలవాండ్రు మొదలగు తక్కువ జాతుల వారికి వేదశాస్త్రములు మొదలగు విద్యలుచెప్పి వారి నగ్రవర్ణజులతో సమానులుగఁ జేయవలయును. ఇదియే నీచజాతుల నున్నత స్థితికిఁ దెచ్చుట.

అమెరికాఖండమునందు మత మహాసభ ముగిసిన వెనుక వివేకానందుని యుపన్యాసముల నెంతవినినం దనివితీరక యచ్చటివా