పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
[10]
73
వివేకానందస్వామి

రనేకులు కొంతకాలము తద్దేశమున నుండి యుపన్యాసముల నింక నిమ్మని ప్రార్థించిరి. అందుచేనాయన మరిరెండు సంవత్సరములచ్చట నుండవలసి వచ్చెను. ఆకాలమునందాయన ప్రతిదిన ముదయము మధ్యాహ్నము సాయంకాలము వేరు వేరు స్థలములయందు ప్రజలడిగిన మతవిషయములగూర్చి యుపన్యసించుచు స్థలాంతరములనుండివచ్చిన పెక్కు జాబులకుత్తరములు వ్రాయుచు నిమిషమయిన వ్యవధి లేక యుండెను. అమెరికాఖండమునందున్న యనేక సంఘములు సమాజములుసభలు నొకదాని నొకటి మించునట్లు గౌరవపురస్సరముగా వానిని రావించి యాతఁడు చేసిన యుపన్యాసముల విని సంతసించెను. ఆదేశమునందు నాస్తికులుండుటచేత వారందఱు స్వామిని తమతమ సమాజములకు బిలిపించి యీశ్వరుఁడున్నాడని ఋజువుచేయుమని యాయన నడిగి యనేక విషమ ప్రశ్నలువేసి పెక్కుచిక్కులం బెట్టిరి. కాని యతఁడు వారి కాధారములయిన ప్రకృతి శాస్త్రముల చేతనే వారి నోళ్లడచి యీశ్వరాస్థిక్యమునుస్థాపించి యాసమాజములలో నెగ్గి వచ్చెనఁట. అమెరికాఖండమునం దతఁడున్న కాలములో కొందఱు నాస్థికులాస్థికు లయిరి. కొందఱు క్రైస్తవులు స్వమతముల విడిచి వివేకానందస్వామికి శిష్యులై తమ పూర్వనామములఁ గూడ మార్చుకొనిరి. ఒకదొరగారు యోగానందస్వామియని పేరుపెట్టుకొనిరి. ఒకదొరసాని తనతొల్లిటి పేరువిడిచి నివేదితయను పేరంబరగుచున్న యది. ఆమెయే హిందూదేశమునకు వచ్చి కలకత్తా కాశీ మొదలగు నగరములలో మన మతవిషయములగు నుపన్యాసములనిచ్చి కొన్ని గ్రంథములను గూడ రచియించినది.

వివేకానందుఁ డింక కొంతకాలము వఱకు జీవించియున్న పక్షమున నమెరికాలో కాలిఫోర్నియా యనుమండలమున నొక దేవా