[6]
కేశవచంద్రసేనుఁడు
41
యానిబంధన కొడంబడినట్లందఱు నొక కాగితముపై వ్రాలు చేయవలయునని యాజ్ఞాపించెను. ఉద్యోగస్థులలోఁ బెద్దలు చిన్నలు నిస్సంశయముగ వ్రాలుచేసినను గేశవచంద్రుడు సంతకముఁ జేయఁడయ్యె. ఆదొర యీమాటవిని మండిపడి వానిం దనవద్దకుఁ బిలిపించె. ఆయధికారి చండశాసనుఁడగుటచే కచేరీవారందఱుఁ గేశవచంద్రునిపని యేమగునోయని గడగడ వడంగఁజొచ్చిరి. దొరవానిం బిలిచి యేలవ్రాలు చేయవైతివని యడుగఁ జంద్రసేనుఁడు సింగపుఁ బిల్ల వలె వానియెదుట నిలిచి యిట్లనియె. 'ఇతరులతో నేసంగతులు చెప్పదగినవో యేర్పరుపక మీరు వ్రాలు చేయమనుట మంచిది కాదు. ఏసంగతులు చెప్పకుండుట యసాధ్యము. వ్రాలుచేసిన పిదప ప్రతిజ్ఞఁదప్పుట యనుచితమని నేను మొదటనే సంతకము చేయనైతిని." ఆమాటలువిని దొర వానిపరిశుద్ధ మనస్సునకును సత్యమునందలి గౌరవమునకు సంతసించి శిక్షించుటకుమారు మెచ్చుకొని పంపి యది మొదలు అతనియందు మిక్కిలి గౌరవమును దయయును జూపుచువచ్చెను. అయినను 1861 వ సంవత్సరమున నతఁడాయుద్యోగమును మానుకొనెను. పిమ్మట కొన్ని మాసములు తప్ప తక్కిన జీవిత కాలమంతయు బ్రహ్మసమాజ మతబోధనమందె గడపెను. బంధువుల ప్రోద్బలముచే నతఁ డాయుద్యోగమునఁ జేరెను. కాని మొదటినుండియు వాని మనస్సున నీసత్కార్యముఁ జేయవలయు ననియే తలంపుండెను.
1860 వ సంవత్సరమునం దాయన "బంగాళ దేశపు బాలకులారా ! ఇదిమీనిమిత్తమే" యను శీర్షికగల చిన్నగ్రంథము నొక దానిం బ్రకటించి దాని వెనువెంటనే యట్టి గ్రంథముల మఱీ పండ్రెండింటిని గూడ బ్రచురించెను. ఆసంవత్సరముననే యతఁడు మతబోధన నిమిత్తము ప్రప్రథమమునఁ గృష్ణనగరునకుఁ బోయెను.