పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/414

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
349
సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులుఅందు ప్రధానమైన దిచ్చట నుదహరించుచున్నాను. వెనుక రంగాచార్యుఁడు రాచనగరు నందలి యాభరణముల లెక్క వ్రాయ నియమింపఁ బడెనుగదా ! ఆపని ముగిసిన యెనిమిదేండ్ల తరువాత నమూల్యాభరణములుకొన్ని రాచనగరులోఁ గానఁబడుట లేదనియు, నందుకు వెనుక పనిజేసిన రంగాచార్యుఁడే జవాబు చెప్పవలయు ననియు వార్తాపత్రిక లాక్రోశింపఁజొచ్చెను. వాని విరోధు లావ్రాత లాధారముచేసికొని వానిని నిందింపసాగిరి. ఈవిషయమున మైసూరు దేశమంతయు నట్టుడికి నట్లుడికెను. ఇది వానివిరోధులు చేసిన కల్పనమేకాని సత్యముకాదు. అతఁ డపుడు మేజరు యిలియట్ అనుదొరచేతిక్రిందఁ బనిచేసెనేకాని స్వతంత్రముగా బనిచేయఁ లేదు. ఆదొరకు, గార్డను మొదలగు తక్కినదొరలు వాని యార్జవమును వేనోళ్ళ గొనియాడిరి. ఈనగలు కానఁబడక పోవుట యబద్ధమనియు, గుమాస్తాల వ్రాత పొరపాటువలన జాబితాలోఁ గనబడలేదు. గాని నిజముగా నగలుండెననియు, నట్టిపొరపాటున కా గుమాస్తాలేకాని రంగాచార్యుఁ డుత్తరవాది కాఁడనియు, నతని ప్రవర్తనము నిర్దుష్ట మనియు మైసూరు సంస్థానములో నప్పుడుండిన విల్సన్ మొదలగు గొప్పదొరలు నొక్కి వ్రాసిరి.

1881 వ సంవత్సరం మార్చి 25 వ తేదీన రంగాచార్యుఁడు మైసూరునకు మంత్రి యయ్యెను. అమాత్యుఁడై రంగాచార్యుఁడు చేసిన కార్యముల గొప్పతనమును మనము తెలిసికొన వలయునన్న నతఁడాయుద్యోగమునఁ బ్రవేశించు నప్పటికి సంస్థానస్థితి యెట్లుండెనో యించుక తెలియవలయు. సరిహద్దుల నున్న యింగ్లీషురాజ్యముననున్నట్లె యన్ని డిపార్టుమెంటులలోని యుద్యోగస్థుల జీతములు మితిమీఱి యుండుట చేతను. 1877 వ సంవత్సరమందు (అనగా ధాతసంవత్సరమందు) గొప్పకాటకముచేతను, దేశము, సంస్థాన