పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/415

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
350
మహాపురుషుల జీవితములుమందలి ధనాగారము గూడ వట్టిపోయెను. ఆ దేశమునందున్న యేఁబదిలక్షల జనములోఁ బదిలక్షలను క్షామదేవత తనపొట్టఁ బెట్టుకొనియె. ఆచచ్చిన వాండ్రందఱు చేతిపనులు మొదలగు కాయకష్టముల వలన జీవించువారగుటచే నట్టిపనులుఁ గూడ నశింప దేశము మఱింత పేదయయ్యెను. అతిభయంకరమైన యాక్షామమునఁ బనులకుఁ బంటలకు గలిగిన నష్టము రమారమి పదునైదుకోట్ల రూపాయలని యంచనా వెయ్యఁబడెను. అంతకుమున్ను చేసిన మార్పులవలన మిగిలిన స్వల్పధనము కుమార మహారాజుగారి పట్టాభిషేక మహోత్సవమునకు, నంతఃపుర వ్యయములకు విధిగాఁజేసికొన వలసి వచ్చిన కొన్ని మార్పులకు వెచ్చింపఁ బడెను. కాటకమునకు ముందు మైసూరు గవర్నమెంటున కేఁటేఁటవచ్చు శిస్తొకకోటిపదిలక్షల రూపాయలు. అది నృద్ధిచేయుటకుఁ గాలస్థితి యనుకూలముగ లేకపోయెను. క్షామము వలన వర్తకము, చేతిపనులు మొదలగునవి క్షీణించెను. ఆంగ్లేయ గవర్నమెంటువారికి మైసూరు దొరతనమువా రివ్వవలసిన యెనుబదిలక్షల రూపాయలకు నేఁటేఁట నాలుగు లక్షలరూపాయలు వడ్డి రూపకముగాఁ బోవుచుండెను. సంస్థాన మివ్విధమున దుస్థితిలో నున్నపుడు రంగాచార్యుఁడు మంత్రిగావలసి వచ్చెను. ఆ స్థితిపాఱఁ జూచిన నెంతధైర్యవంతుని మనసైన చెదిరిపోవునుగదా ! కీడులో మేలగునట్లు రంగాచార్యుని కీయవస్థలో నొక్క సంతోషము మాత్రము గలుగుచు వచ్చెను. క్రొత్తగా గద్దెయెక్కిన కుమార మహారాజునకు స్వయముగా నాలోచనముఁ జెప్పి రాజ్యతంత్రము నడపుట శక్తిలేకపోయినను మంత్రిచెప్పిన యాలోచనము గ్రహించి యతఁడు చేసిన మంచిపని మెచ్చుకొనుటకైన సామర్థ్యము గలవాఁడగుటచే రంగాచార్యుని ప్రయత్నములన్నియు నిర్విఘ్నములుగ సాగెను.