పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/372

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[40]
313
సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు

ఆకాలమున దక్షిణకన్నడపు జిల్లాలో ధర్మశాస్త్రములో జక్కనిప్రవేశముగల సబుజడ్జీయొకఁడు కావలసివచ్చెను. ఆయుద్యోగమునకు ముత్తుస్వామి యయ్యరుకంటె దగినవాఁడు లేఁడని దొరతనమువా రతనినే నియమించిరి. ఈయుద్యోగము మూడేండ్లు చేసిన పిదప 1868 వ సంవత్సరమున దొరతనమువారు ముత్తుస్వామినిఁ జెన్నపట్టణమున పోలీసు మేజస్ట్రీటుగా (ప్రెసిడెన్సీ మేజస్ట్రీటుగా) నియమించిరి. ముత్తుస్వామి యయ్యరు వద్దనున్న ముఖ్యగుణ మేమనగా నతఁడు భయముగాని, పక్షపాతముగాని లేక శ్రద్ధాళువై తన విధికృత్యములఁ దీర్చుచువచ్చెను. దీని కుదాహరణముగా నొక కథగలదు. ఒక హిందువుఁడు హైకోర్టుజడ్జీలలో నొకని గృహావరణములోఁ బ్రవేశించినాఁడని యాజడ్జీ వానిం దిట్టముగఁ గొట్టెను. ఆహిందువుఁడు మన యయ్యరుగారివద్ద నాజడ్జీమీఁద నభియోగము తెచ్చెను. గొప్పవారిమీఁద నిటువంటి నభియోగములు వచ్చినప్పుడధికారులు ముందుగా వారికిసమనులు చేయక "మీకు సమను లేల చేయఁగూడదో తెలియఁజేయు" డని ముందుగా వ్రాయుదురు. అయ్య రట్టిపనిచేయక యాజడ్జీగారికి ముందుగా సమనుచేసెను. హైకోర్టు జడ్జీయంతవాని నంతస్వల్పనేరముమీద దనకోర్టుకురప్పించుట భావ్యముగాదని తనపైయధికారి హితోపదేశము చేసిననను వినక యయ్యరు వానిని దనయెదుటకు రప్పించుటయేగాక నేరస్థుని జేసి మూడురూపాయలు ధనదండన విధించెను. ఈయుద్యోగమునందున్నపుడే ముత్తుస్వామి యయ్యరు బి. యల్. పరీక్షకుఁ జదివి యందు మొదటితరగతిలోఁ గృతార్థుఁ డయ్యెను.

అనంతరము దొరతనమువారు ముత్తుస్వామిఅయ్యరును స్మాలుకాజుకోర్టు జడ్జీగా నియమించిరి. ఈ పదవిలోనుండి యాయన దొరతనమువారికి గలుగ జేసిన సంతుష్టి యింతింత యనరాదు. అప్పుడు