పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/371

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
312
మహాపురుషుల జీవితములురాక విని మునసబు వాని దరిశనముచేసి తనకోర్టు శోధించి పరీక్షింప వలయుననియుఁ దాను వ్యాజ్యములు విచారణచేయుచుండగా దగ్గర కూర్చుండి వినవలయుననియు నధికారిని గోరెను. అతని కోరికప్రకారము జడ్జీకోర్టు పరీక్షించి వాని ప్రక్కను గూర్చుండి వ్యాజ్యముల విచారణ విని చాల సంతోషించి తంజావూరువెళ్ళి ముత్తుస్వామి యయ్యరు తనతో సమానముగ జడ్జీపని చేయదగినవాఁడనియు వాని తెలివి యసాధారణ మైనదనియు వ్రాసెను.

ముత్తుస్వామియయ్యరు చిరకాల మాయుద్యోగమునం దుండ లేదు. ఆకాలమున దొరతనమువారు మనరాజధానిలో నున్న యీనాములనుస్థిరపరచి యీనాముదారులకు సర్వాధికారమునీయవలయునని యాపనిచేయుట కీనాము కమీషనరు నేర్పరచి వానికి సహాయముగా కొందఱు డిప్యూటీకలక్టరుల నేర్పరచిరి. అందులో ముత్తుస్వామి యయ్య రొక్కఁడు. ఆయీనాము కమీషనులో నతఁడు దేశస్థులకు దన యధికారులకు సంతుష్టి కలుగునట్లు బనిచేసెను. తరువాత దొరతనమువా రతనికి డిప్యూటి కలక్టరుపని స్థిరపరచి మేజస్ట్రీటు నధికార మిచ్చిరి. ఈయుద్యోగమం దుండగా నొకసారి యొక గొప్ప షాహుకారు మోసముచేసినాడని నేరస్థుఁడుగఁ జేయఁ బడెను. అది ముత్తుస్వామి యయ్యరు విచారణ సేయవలసివచ్చెను. షాహుకారుపక్షమున న్యాయవాదులలో నగ్రగణ్యుఁ డగు నార్టనుగారు వచ్చి పనిచేసిరి. ముత్తుస్వామి యయ్యరు పదునైదుదినములు విచారణచేసి యానేరమును జిల్లాజడ్జీగారు విచారణ చేయవలసినదని యాకోర్టులకు బంపెను. నార్టనుగారు చెన్నపట్టణమునకుఁబోయి తన మిత్రుఁడు హైకోర్టుజడ్జియు నగు హాలోవేగారిని గలుసుకొని ముత్తుస్వామి యయ్యరువంటి మేధావంతుని రివిన్యూ వ్యవహారములలో నిలుపుటచే వాని తెలివి వ్యర్థమగుచున్నదని చెప్పెను.