పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/360

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
303
రాజా సర్ మాధవరావుమంత్రియగు బిస్‌మార్కు ప్రభువునకుఁ బంపెను. బిస్మార్కు వ్యాసములోనున్న విశేషాంశమును గ్రహించి సంతసించి స్వహస్తముతో మాధవరావునకు స్తోత్రపూర్వకముగా నొక జాబు వ్రాసి యావ్యాసమును జర్మనిభాషలోనికి దర్జుమా చేయించి ప్రతిసిపాయికి బంచి పెట్టించెను.

మాధవరావు స్వభాషయగు మహారాష్ట్రమందు జాల గృషి చేసి కవిత్వము చెప్ప నేర్చెను. ఆభాషలోనున్న కవిత్వము కఠిన పదములు లేక స్త్రీలకు బాలురకు నుపయుక్తముగ నుండును.

నిండుయవ్వనమున మాధవరావు తిరువాన్కూరు బరోడా సంస్థానములగూర్చి మిక్కిలి కష్టపడుటచేత దేహస్థితి త్వరలో చెడిపోయెను. అతనికి 1890 వ సంవత్సరం డిసెంబరు 22 వ తారీఖున పక్షవాతము ప్రవేశించెను. ఆ రోగముచే నతఁడు రమారమి మూడు మాసములు తీసికొని 1891 వ సంవత్సర మేప్రియల్ నాలుగవ తారీఖున గాలధర్మము నొందెను. ఇంగ్లాండులో హిందూ దేశములో నఖండ ఖ్యాతిని సంపాదించిన ఈ మహాత్మునిగూర్చి వేరువ్రాయవలసిన దేమియులేదు. హిందూదేశస్థులు దేశపరిపాలనమునకుఁ బనికిరారని తెల్లవారు పలికెడు పలుకులు వట్టి బూటకములని యీయన చరిత్రమువలన దెలిసికొనవచ్చును. హిందూదేశమునకు గవర్నరు జనరలుగా మాధవరావు నియోగింపబడిన పక్షమున నీతెల్ల గవర్నరు జనరలులలో ననేకులకంటె మిక్కిలి చక్కగా బరిపాలనము జేసియుండును. అతఁడు సంపాదించిన ధనములో నొక గవ్వయయిన నన్యాయార్జితము లేదు. చిన్ననాటనుండియు నతఁడు మహోన్నత పదవులలో నుండుటంబట్టి యతఁడు కొంచెము బెట్టు సరిగ నుండున ట్లగుపడుచువచ్చె. కాని చూడవచ్చిన వానిని గౌరవించుట కలసిమెలసి మాటాడుట మొదలగు గుణముల కేలోటు