పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

మహాపురుషుల జీవితములు



పద్ధతి పెట్టలేదు. వెనుక మైసూరు సంస్థానములో దివానుపని జేసిన పూర్ణయ్య యను మహామంత్రివంటి బుద్ధికుశలత మాధవరావువద్ద లేకపోయినను నితఁడు పూర్ణయ్యకంటె స్థిరమనస్కుఁడు, సత్ప్రవర్తకుఁడు నని చాలమంది తెల్లవా రభిప్రాయపడిరి. హిందూదేశ ధనాదాయ విషయమున నింగ్లాండులో నొక సభ వారియెదుట సాక్ష్య మిచ్చుటకు మాధవరావుగారి నా దేశము వెళ్ళుమని యప్పటి గవర్నరు జనరలుగా రాయనపేర వ్రాసిరి. కాని మాధవరావు విదేశయాత్ర తన మత మొప్పదని మానుకొనెను.

1877 వ సంవత్సరము ఢిల్లీలో జరిగిన దర్బారునకు సగౌరవముగ బిలువఁబడి మాధవరావు తన చిన్న రాజును వెంటబెట్టుకొని పోయెను. అక్కడ మాధవరావునకు విశేష గౌరవము జరిగెను. అప్పుడే గవర్నరు జనరల్ లిట్టను ప్రభువు వానికి రాజా బిరుద మిచ్చెను. మాధవరావు తన కాలోచన చెప్పుటకు రెసిడెంటు మఱికొందఱు గొప్ప యుద్యోగస్థులు గల యొక సభ నిర్మించి దాని యాలోచనముం బట్టి నడచుచుండెను. చిన్న రాజునకు విద్య నేర్పుటకు బొంబాయినుండి యీలియెట్టను నొక తెల్లవానిని పిలిపించి శ్రద్ధతో విద్య చెప్పించుటయేగాక విద్యాభివృద్ధినిఁ గూర్చి స్వయముగాఁ గనుగొనుచువచ్చెను. 1882 వ సంవత్సరమున నా చిన్నరాజునకు యుక్తవయస్సు వచ్చినందున నింగ్లీషువారు వాని నాసంవత్సరమే సింహాసన మెక్కించిరి. గద్దెయెక్కినతోడనే మహారాజునకు మంత్రికి మనస్పర్థలుపుట్టెను. అందుచేత మాధవరావు 1882 వ సంవత్సరమున సెప్టెంబరు నెలలో నుద్యోగము మానుకొనెను. బరోడా మహారాజు మంత్రి తనయొద్ద నుద్యోగము మాని పోవునపుడు మూడులక్షల రూపాయల బహుమాన మిచ్చెను. ఇట్లు మాధవరావు యొక్క చరిత్రలో రెండవయధ్యాయము ముగిసెను.