Jump to content

పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[22]

సర్. జేమ్సేట్జీ జీజీభాయి

169

రెండవది విదేశప్రయాణము. విదేశములకుఁ బోవుట తప్పని తలఁచినంతకాలము మనదేశస్థులు దారిద్ర్యము ననుభవింపుచునే యుందురు. నిరుపయోగములగు నిబంధనములఁబెట్టికొని సంకెళ్ళు తగిలించుకొన్న వానివలె విదేశములకుఁ బోవఁజాలక మన దేశముననే తిరుగుచుండుటచే మనయవస్థ యింతవఱకు వచ్చినది. విదేశములతో యధేచ్చముగ వర్తకముఁ జేయుటచేతనే జీజీభాయి మిక్కిలి గొప్ప వాఁడయ్యెను.

మూడవది దాతృత్వము, మన దేశములో దాతలసంఖ్యయధికముగానే యున్నది. కాని యాదాత లందఱు పాత్రాపాత్రము నుచితానుచితము నెఱుఁగక దానములు సేయుచున్నారు. బ్రాహ్మణులనిమిత్తమే యుపయోగించు సత్రములను నెవ్వరికి నుపయోగము లేని దేవాలయములకు నిమ్మన్న చో మన దేశస్థులు ముందంజవేయుదురు. దిక్కు లేనివారికి సత్రములువేయించుట మొదలగు సత్కార్యములు మన వా రిదివఱ కెఱుఁగనే యెఱుంగరు. బ్రాహ్మణులుగాని వారికి దానము సేయుట పాప హేతువని మనవారికి దురభిప్రాయము గలదు. జీజీభాయిగారి చరిత్రమువలన నట్టి దురభిప్రాయములు పోవుగాక!