పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
[20]
153
స్వామి దయానంద సరస్వతి

మతము స్థాపించి భరతఖండము నుద్ధరింపఁ దలఁచిన యా మహానుభావుఁడు తుదకీవిధముగా వేశ్యాంగనచేత మృతినొందవలసివచ్చెను.

దయానందుని జీవితము సంగ్రహముగఁ దెలిపితిమి గనుక నిఁక నాతని మతసిద్ధాంతము గుణగణములుఁ జెప్పవలసియున్నవి. ఆయన మతమునకు వేదమే ముఖ్యాధారము. వేదమే నిత్యమనియు నందుచేత నీశ్వరదత్తమనియుఁ దత్కారణమునఁ బరమప్రమాణ మనియు నతఁడు జెప్పుచువచ్చెను. ఆయన మతప్రకారము పురాణములు కల్పింపఁబడిన కట్టుకథలు. అబద్ధములు దుర్బోధకములు నగు నీపురాణముల మూలముననే మనదేశ మింత దుస్థితికి వచ్చినదని యాయన పలుమారు చెప్పుచువచ్చెను. వేదమునుతప్ప మఱియొక గ్రంథ మెన్నఁ డాయన ప్రమాణముగ గ్రహింపలేదు. వేదములు బ్రాహ్మణులొక్క రే చదువుట కేర్పడిన పుస్తకములు కావని యాయన నమ్మెను. నదులలో జలము, సూర్యుని తేజస్సు సకల జాతులవారి కెట్లుపయోగములుగ నున్నవో యట్లె వేదములుఁగూడ బ్రాహ్మణులకే గాక శూద్రులకు స్త్రీలకు మాలలకు సయితముఁ జదువఁ దగినవని యాయన చెప్పెను. వర్ణ భేదము పుట్టుకను బట్టి యుండఁగూడదని యతని సిద్ధాంతము. గుణమును బట్టియు వృత్తిని బట్టియు విద్యను బట్టియుఁ జండాలుఁడైన బ్రాహ్మణుఁడు గావచ్చును. విద్యాగుణహీనుఁడు బ్రాహ్మణుని కడుపునఁ బుట్టినవాఁడు ఛండాలుఁడే యగును. స్త్రీవిద్య తప్పక ప్రోత్సాహము చేయదగ్గదనియు నాడువాండ్రు చదువుకొననిపక్షమున దేశము మూర్ఖభూయిష్ఠమగు ననియు నతఁడు బోధించుచువచ్చెను. బాలికలకు యుక్తవయసు రాకమునుపు చిన్న తనమందె వివాహముసేయుట యశాస్త్రీయమనియు నతిబాల్య వివాహమువలన దేశ జనులందఱు బలహీనులై యున్న వారనియు నందుచేత మగవాని కిఱువదియైదు సంవత్సరములు వచ్చిన తరువాత