పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
154
మహాపురుషుల జీవితములు

నాడుదానికిఁ బదునారేండ్లు దాటినపిమ్మట వివాహములు జరుపవలసినదనియు నతఁడు వాదించెను. వితంతువులు మరల వివాహముఁజేసికొనఁ గూడదని వేదమునం దెచ్చటఁ జెప్పఁబడలేదు. కాఁబట్టి యా వివాహములు మంచివే యని యతని నమ్మకము. ఆయన సిద్ధాంతప్రకారము హిందువులందఱు విదేశములకుఁ బోయి నౌకాయాత్రలుచేసి రావచ్చును. అట్లు చేసినందువలన వారి జాతి మతములు చెడవు. వివాహాదులు వేదమంత్రములతోనే జరుగ వలయును.

ఆర్య సమాజమతములోఁ జేరినవారికిఁ గొన్ని వైదికకర్మలు గూడ విధింపఁబడియున్నవి. వేదములే ప్రమాణములని చెప్పుట, వైదికకర్మలు కొన్ని విధించుటతప్ప తక్కినవిషయములలో దయానందుఁడు బ్రహ్మసమాజమతస్థులవలె దేశాభివృద్ధికరము లగు మార్పులం జేసెను. ఈమహాత్ము డీమార్పులుజేసి ప్రాఁచీన వైదిక మతమును నిలుపఁ దలఁప పూర్వాచారపరాయణు లదియొక క్రొత్త మతముగ భావించి వానిని దూషించి యనేకవిధముల బాధించి యొకానొకప్పుడు చంపుటకుఁగూడఁ బ్రయత్నించిరి. ఒకమా ఱొక జమీందారుఁడు వానితోఁ గొన్ని యంశములు ముచ్చటించి తన వాదము పూర్వపక్ష మగుటచే నప్పుడె దయానందునిఁ గొట్టబోయి వీలు లేక యూరకొని రాత్రి దయానందుని జంపుమని నలువురు మనుష్యుల నంపెను. అప్పుడు దయానందుఁ డూరుబైట నొక చిన్న పాకలో నివసించుచుండెను. ఆనరహంతకులు నడిరేయివచ్చి స్వామిని బిలువ నతఁడు పాక వెడలి యావలకు వచ్చెను. పరమ శాంతమును పవిత్రతను వెదజల్లు నాతనివిగ్రహమును జూచినతోడనే హంతకులు తమచేయదలఁచిన ఘోరకృత్యమును మాని పాఱిపోయిరి. మఱి యొకసారి వైదికబ్రాహ్మణుఁ డొకఁడు భక్తిగలవానివలె వెళ్ళి