పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వామి దయానంద సరస్వతి

ఈయన హిందూ దేశమునందు, ఆర్యసమాజమను క్రొత్త మతమును స్థాపించిన మహాత్ముడు. ఈతఁడు ఘూర్జర దేశములోనున్న 'కతేవారు' సంస్థానము నందలి మోర్వీ యను గ్రామమున 1825 వ సంవత్సరమున జన్మించెను. తల్లిదండ్రులపేరు లెవ్వ రెఱుంగరు. ఆయన తండ్రి యాగ్రామమునకు జమీందారుగా నుండుటయేగాక స్వల్పధనవంతుడై వడ్డీవ్యాపారము చేయుచు సుఖముగఁ గాలక్షేపము చేయువాడు. మతమున నతడు పరమశైవుడు. ఆతని భార్యయు బాతివ్రత్యంబునకు సౌజన్యతకుఁ జాల పేరువడినది. దయానందున కైదవ యేట నక్షరాభ్యాసమయ్యెను. అది మొద లెనిమిదవ యేడు లోపుననే దేశభాషను సంస్కృతమును దన యీడు పిల్లలకంటె నెక్కువ తెలివితో నతఁడు నేర్చికొనెను. ఎనిమిదవయేట నుపనయనము జరగుటచే నప్పటినుండియు దండ్రి వానికి శైవమత రహస్యముల నుపదేశించి పార్థివలింగపూజనము ప్రతిదినము చేయించి రుద్రాధ్యాయములోఁ జెప్పఁబడిన విధుల నన్నిటిని గ్రమముగఁ జేయుమని కుమారుని బలవంతపెట్టఁ జొచ్చెను. దయానందుడు సహజముగ బలహీను డగుటచే నతఁ డంత చిన్న తనమున బెద్దలు చేయవలసిన నియమములన్నియు జేసినచో శరీరస్థితిచెడునని యప్పు డప్పుడు తల్లి మొఱవెట్టుకొనుచు వచ్చినను వినక తండ్రి వానిచే నట్టి నియమముల జేయించు చుండెను. ఎనిమిదవయేడు మొదలు పదునాలుగవయేడు వఱకుఁ దయానందుఁడు శ్రద్ధతో విద్యనేర్చి కొన్ని కావ్యములను జాలవఱకు వ్యాకరణమును యజుర్వేదసంహితను ముగించెను. అప్పుడు తండ్రి వానిని బరమశైవుఁడుగ జేయదలచి 1859 వ సంవత్సరమున మహా