Jump to content

పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

మహాపురుషుల జీవితములు

రెండవ భార్యవలన నతనికి కుమారుఁడు కలిగెను. గాని వాఁడును శైశవమునందే మృతినొందెను. అతఁడు నిగర్వియై డంబములేక సామాన్యునివలెనే జీవితకాలము గడపెను. అతఁడు స్వమతాభిమానముగల హిందువుడైనను సంఘసంస్కారమునకు విరోధికాఁడు. సంస్కారము మెలకువగాను నెమ్మదిగాను జరుపవలయునని యతని యభిప్రాయము. అతఁడు న్యాయదృష్టిగల స్వతంత్రుడు. బిరుదుల నిమిత్తము దొరతనమువారి నెన్నఁడు నాశ్రయింపలేడు. అయాచితముగా బిరుదులు వచ్చినప్పుడు వానిని గ్రహింపకపోలేదు. అతఁడు తనకు రావుబహద్దరు బిరుదము వచ్చినప్పుడు పత్రికలలో నిట్లు వ్రాసెను.

"మాపేరు రావుబహద్దరులలో నగపడుటచే మేము మిక్కిలి యాశ్చర్యము నొందినారము. మే మేనేరము చేసినామని మాకీశిక్ష విధింపఁబడినదో తెలియఁ జాలము. మాకు బిరుదులు పొందవలయునని యాసలేదు. మేము చేసిన సేవకు సంతసించి దయామయులై యధికారులు మాకీ గౌరవమును దయచేసి నందుకు కృతజ్ఞులమై యున్నారము. మాకీసంగతి ముందు తెలిసిన మా మాట సాగెడు పక్షమున మేము మా జోలికెవరు రావలదనియు బిరుదులు గిరుదులు మాకవసరము లేవనియు వానిందప్పక వేఁడుకొని యుందుము."

ఈ పైవాక్యములఁ బట్టియు యింకఁ దక్కిన సంగతులఁ బట్టియు కృష్ణదాస్‌పాలుడు 19 వ శతాబ్దమునఁ బుట్టిన దేశాభిమానులలో నొకఁ డనియు వాని మార్గము ననుసరించుటకు మన మందఱముఁ బ్రయత్నము చేయుచుండవలయు ననియు జదువరు లీతని చరిత్రమువలనఁ గ్రహింతురుగాక !