పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


అభ్యాగతుల నెన్న డతఁడు పొమ్మనలేదు. పటాటోపము లేక స్నేహితులకు విందు లతఁ డప్పుడప్పుడు చేసెను. వారికి వడ్డి లేకుండ ఋణముల నిచ్చుచుండెను గాని వా రేరోజున సొమ్మునిచ్చి వేసెదమని చెప్పిరో యారోజున నతఁడు ఖచితముగ సొమ్ముఁ బుచ్చుకొనుచుండెను. వ్యవహారములో మిక్కిలి నిష్కర్షగ నతఁడు మాటలాడును. కుచ్ఛితవ్యాపారము లేమియు నతనిలో లేవు.

అన్ని విద్యలలో నతఁడు ముఖ్యముగ వక్తృత్వము నభ్యసించెను. గొప్పవక్త కాకపోయినను సభాకంప మతనికి లేదు. శిశిరో, పాంపేయి, సీజేరు; వీరు ప్రతివాదిపక్షమునఁ బ్రసంగించుట కిష్టపడనపుడు, క్రాససు లేచి వానిపక్షమున మాటలాడుచుండెను. ప్రసిద్ధికెక్కిన న్యాయవాదుల చేత విడువఁబడిన ప్రతివాదులను చేరఁదీసి వారిపక్షము నితఁ డవలంబించెను. అందుచేతఁ బ్రజ లితనిని నుతించిరి. రోమనులలో నెట్టి యధముఁడైనను వాని కితఁడు వందనముచేసి వానివలనఁ. బ్రతివందనములను గైకొనుచుండెను.

ఇతఁడు దేశచరిత్రలను, మహాపురుషులచరిత్రలను బాగుగఁ జదివెను. మహామహోపాధ్యాయుఁడైన 'ఆరిస్టాటి' లుపన్యసించిన తత్త్వజ్ఞానమునం దితని కభిలాష మెండుగనుండి, దాని ననుసరించెను.

ఆ రోజులలో 'మేరియస్సు' 'సిన్నా' యను నిరువురు రోమనులు సెనేటుసభలోఁ గక్ష వహించినందున, వారిమూల