పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కసు క్రాసస్సు

77


పైని పారవేసిన వస్తువులను దొంగిలించి తెచ్చిన సొమ్ము కొంతకలదు. ఈవిధమున నతఁడు 7,100 టాలంటులు గణించెను,

రోముపట్టణములోని గృహములు సాధారణముగ నిప్పుముట్టుకొని తగులఁబడుచుండెను. గృహములన్నియు కలిసి. యుండుటచేత శీఘ్రముగ నవి యంటుకొనినందున వాని నార్పుట కవకాశము లేకపోయెను. అందుచేత నతఁడు కమ్మరులు లేపకారులను సుమారు 500 మందిని జాగ్రతచేసెను.. నిప్పంటుకొనిన గృహములను వాని సమీపమున నున్న వానిని నతఁడు గొనుచున్నందున పట్టణములో చాల భాగ మతనిదియై యుండెను. అయిన నతఁ డొక గృహములో వాసము చేయుచు మిగిలినవానిని కట్టించలేదు. ఆ నివాసమైనను, విరివిగ నున్నది కాదు.

అతనికి వెండిగనులు మెండుగ గలవు. వాని రాఁబడి విశేషముగ నుండెను. వానియొద్దనున్న బానిస లనేక వ్యాపారములను నేర్చినవారు. వైటికులును (Diamond Cutters} వర్థకులు (Carpenters), రుక్మకారకులు (Geldsmiths), ముండులు (Barbers), రజకులు (Washermen), మాంసికులు (Meet Sellers), భారవాహకులు మొదలగువా రతనియొద్ద పనిఁజేయుచుండిరి. వీరిమూలమున వచ్చుచున్న సత్త మధికముగ నుండెను, లేఖకులుకూడ నతనియొద్ద నుండిరి. ఎవ రెవరి కెటు లటుల పనుల నిర్మించి వారి వారిచేత నతఁడు పనులను జేయించెను.