పుట:Lanka-Vijayamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లంకావిజయము

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

ఆ.

అమరు సకలలోకసమితి కు య్యేరీతి
రహితముగను సిరి కిరవును విబుధ
విలసితంబు నగుచు విపులం బయోధ్యయ
నునగరము సురపురి ననుకరించి.

1


[ఈ పద్యము మొదలు రెండర్థములు వచ్చునట్లు చెప్పుచున్నాడు. నియమప్రకారము మొదటియర్థమున రామకథయును, రెండవయర్థమున లంకమాన్యమును ధర్మరావు హరించుట మొదఁగు లక్ష్మణకవిపక్షమైన యర్థమును దోఁచుచుండును.]


రాఘవ.

 సకలలోకసమితికుయ్యి = సకలజనసముదాయముయొక్క మొఱ్ఱ, ని. “లోకస్తుభువనేజనే" అని యమరము. ఏరీతిన్ = ఏప్రకారముచేతను, రహితముగను = లేనట్లుగా, ఇక్కడఁ గుయ్యిశబ్దములోని యికారమునకు “కిమాదికస్యేతః" అను నాంధ్రశబ్దచింతామణి సూత్రముచేత లోపము. సిరికి = లక్ష్మికి, ఇరవును = స్థానమును, విబుధవిలసితంబును = పండితులచేఁ బ్రకాశింపఁజేయఁబడినదియు, అగుచు=దిప్పుచు, విపులంబు=విశాలమైన, అయోధ్యయను = అయోధ్యయను పేరుగల, (ఇచ్చట, అనుశబ్దములోని అకారమునకు, అం. శ. చిం. “యశ్రుతిమార్యా లఘుయం ప్రవదంతి" యను సూత్రమువలన యకారము.) నగరము = పట్టణము , సురపురిని = అమరావతిని, అనుకరించి = పోలినదియై, ఆమరున్ = వెలయును.