Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 115

డీప్ ఎక్సరేవల్ల కేన్సర్ ఎందుకు వస్తుంది?

డీప్ ఎక్సరేని కేన్సర్ వచ్చినప్పుడు అది నివారింప బడడానికి చికిత్సగా ఉపయోగిస్తారుకదా, మరి దానివల్లనే ట్యూబెక్టమీ ఆపరేషనుకి బదులుగా ఉపయోగించినపుడు కేన్సర్ ఎందుకు రావాలని కొందరు అడుగుతూ వుంటారు. కాని ఏ ఎక్సరే కిరణాలకి కేన్సర్ కణుతులను మాడ్చివేసే శక్తి వుందో, వాటికే కేన్సర్‌ని కలిగించే గుణం కూడా ఉందని తెలుసుకోవాలి. అందుకనే మామూలు పరిశ్రమలలో రేడియంతో కాని, ఎక్సరేలతోకాని పనిచేసే వాళ్ళలో వాటి ప్రభావంవల్ల కేన్సర్ ఎక్కువగా వస్తూ వుంటుంది. న్యూయార్క్‌లోనూ, న్యూ జెర్సీలోనూ చేతి గడియారాల పరిశ్రమలలో గడియారాల ముల్లులకు, అంకెలకు రేడియం పెయింట్ చేసే పనివాళ్ళలో ఎముకలకి సంబంధించిన కేన్సర్ జబ్బు ఎక్కువగా కనబడుతుంది. కారణం రేడియం కిరణాలు శరీరంలోకి ప్రవేశించి హాని కలిగించడమే. అదే విధంగా హీరోషిమా, నాగసాకిల మీద ఆటంబాంబు పడినప్పుడు ఆ ఎక్స రే కిరణాలు తగిలిన ఎందరో ప్రజలు రక్తంలోని కేన్సర్ జబ్బులకి గురికావడం జరిగింది. అడే విధంగా ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్సరే ట్రీట్ మెంటు చేయించుకుంటే ఆరోగ్యకరమైన గర్భాశయ కణాలలో కేన్సర్‌కి సంబంధించిన లక్షణాలు నిదానంగా కొంతకాలానికి ప్రారంభమవడానికి అవకాశం ఉంది.