పుట:Krxshhiivaludu (1924).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          కడకు నేల చదునుగాగ గాల దున్ని
          యాకలెత్తిన నిండ్లకు నరుగుచుంద్రు. 95

జడివానన్‌ వలిబడ్డ బక్క మొదవుల్‌ సంఘంబులై బీళులన్‌
విడియఱ్ఱాడుచు దొడ్డిజేర నవిగో వేగంబుగ న్వచ్చె; పె
ల్లడుసుల్వోవని మిట్టనేల బసి గొయ్యల్నాటి కట్టించి వెం
బడి వేయింపుము గడ్డిగాదములు చొప్పల్‌ బొందుపుల్దంటులన్‌. 96

తమ్ముడు కుఱ్ఱ, గోచయము దాటులువెట్టుచు క్రేపుదామెనం
గ్రమ్ముచు జిఱ్ఱకొట్టుచు పరస్పరముం దల డీలుకొంచు ము
న్గొమ్ముల జిమ్ముచుం దిరుగ గొట్టిన బట్టిన లొగ్గిరావు, సా
యమ్మొనరింపు మీయదన నాలమరల్పగ పల్పువెట్టగన్‌. 97

తడిసిన పచ్చికట్టియలు తంగెడు తప్పర తాటియాకులం
బడతుక ప్రొయ్యిలో దుఱిగి పై పొగలెత్తగ నూఁదుకాని కూ
డుడుకదు; కాకకుం బొగకు నుప్పతిలెం గడగంట బాష్పముల్‌;
తడయక యెండు రెమ్మలను దట్టెడు త్రుంచుమ చెట్టుచేమలన్‌. 98

మును వేసంగిని కుచ్చివిడ్డ పిడకల్‌ బొప్పర్లు బొళ్ళెంబులన్‌
వెనుకంబెట్టిన తాటిచుండ్లు బరికెల్‌ వెళ్ళించె నిన్నాళ్ళు; నిం
క నవాంబోధర మాలికా పిహిత దిగ్జాలంబులై వర్షపున్‌
దినముల్‌ డగ్గరె; కాంతబాసనము నేతీరొప్ప సాగించెడిన్‌. 99