పుట:Krxshhiivaludu (1924).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావలోచన మెరవుగా బడయకున్న
గాంచనేర వంతర్లీన కాంతిసరణి. 79

అనిలాలోలవినీలసస్యములు భంగానీకముల్గాగ తె
ల్లని కొంగ ల్పయిదేలు నుర్వులుగ లీలన్‌ ఱెక్కలల్లార్ప, మ
ధ్యను రాజిల్లు కుజంబు లోడలుగ వాతస్ఫూర్తిగంపింప, స
స్య నికాయావని సాగరం బటుల నేత్రానందముంగూర్చెడిన్‌. 80


కుసుమ లతావలీ కలిత కుంజములం, కిసల ప్రకాండముల్‌
పసరులు గ్రక్కు వృక్షముల బాలతృణంబుల జేలగట్లు సొం
పెసగ, సమస్తరత్నముల నేరిచి కూర్చిన ఱాలబిళ్ళలన్‌
వసుధ కమర్చిరో కృషికవర్యు లనన్‌ వరిమళ్ళు శోభిలున్‌. 81

మరకత చూర్ణవర్ణముల మండితమౌ నవశాలిభూమి సుం
దరతను గాంచ వైదిక దినంబులలో భరతక్షమాధురం
ధరయగు సస్యలక్ష్మి దయదప్పక నేటికి నార్యధారుణీ
భరణ కుతూహలస్ఫురణ భాసిలునో యననొప్పు హాలికా. 82

కడమొదలులేని నీదేహకష్టములకు
బ్రతిఫలంబగు సస్యసంపత్తి గాంచి
కవివి గాకున్న వాగ్మిత గలుగకున్న
బ్రణుతి వర్ణింపు మొకసారి భాగ్యగరిమ! 83