పుట:Krxshhiivaludu (1924).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

     వ్రాసినట్టి చిత్రపటమన విలసిల్లె;
     దొంగిచూడు మిపుడు తూర్పుదిక్కు! 18

     వేకువనె లేచి వైకుంఠవాకిళులను
     ముంగిట రచించి గుమ్మడిపూలతోడ
     గొబ్బిముద్దల నిలిపి కుంకుమను జల్లె
     నీ యనుంగుకూఁతురు; గాంచుమోయి సొబగు. 19

గనిమల తుంగకున్‌ గఱికకాడల కల్లిన సాలెగూళ్ళ స
న్నని పటికంపుమంచు పడి నాణెపు ముత్తెసరాల పోలికం
గనుఁగొన రమ్యమయ్యె రవికాంతులఁ దేలుచు, నిట్టి భావమో
హనపు నిసర్గ శిల్పముల, హాలిక, త్రొక్కక దాఁటిపొమ్మిఁకన్‌. 20


పొలముల కేగు పల్లెతలు పుత్తడిగాజులు ఘల్లుమంచు రా
పిలి యులివెత్తగం జిటికెవేయుచు నిన్గని యేలపాటలం
జెలువుగ బాడ నుప్పతిలు సిగ్గున నూరకపోక మాఱుపా
టల నెలుగెత్తి పాడుమ, మిటారుల నవ్వుల కాస్పదంబుగన్‌. 21

     గ్రామవాసుల కిట్టి నిష్కైతవంపు
     ముగ్ధపరితోషములు సుఖభోగ్యములగు;
     బట్టణ నివాసకుల శుష్కభావములను
     నిట్టి సామాజికానంద మెసఁగఁగలదె? 22