పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
20


గం. 2-20 నిమిషములకు శతావధానముఁ బ్రారంభించి (తెల్లవారు జాము) గం. 2-10 ని.లకు ముగించిరి. ఆ సభకు బ్రహ్మశ్రీ దేశిరాజు కృష్ణయ్య పంతులుగా రగ్రాసనాధిపత్యము వహించిరి. పృచ్ఛకులకు ననులోమ విలోమ సంఖ్యాకముగాఁ గోరిన విషయములం గూర్చి కోరిన వృత్తములం జెప్పిరి, ధారణా శక్తి తప్పిపోవుట గాని, సమస్యాపూరణ మందు సారస్యము లేకపోవుట గాని, అవధానాంతమునఁ బద్యములు చదువకుండుట గాని, కోరిన సమస్యలు మార్చి పూర్తి సేయుట గాని, పద్యములు మఱునాడు చదివెదమనుట గాని సంభవింపక, యసూయాగ్రస్తులకు సైతము వేఱైన యూహలు దోఁపఁదగిన వ్యవధి లేకుండుటచే నిదియేమి యాశ్చర్యమను నట్లు సభ్యులగు వారికందఱ కత్యధికమగు సంతసమును గలిగించిరి. మూఁడవనాఁడు (16-9-1911) సభ్యుల కోరికచే వారి యత్యద్భుత కవితా ధారఁజూపి గంటకు 480 పద్యములు చెప్పి మెప్పు గాంచిరి. పులినిఁ జూచి నక్క వాఁతఁ బెట్టుకొన్న సామ్యమున నీ సోదర కవులవలె నాశు కవిత్వమును జెప్పుటకు సాహసించి మృదు మధురశైలి లేకపోగా నడుగు సాఁగక, విషయము తోఁచక, యతులు గతులు చెడుట వలన మతియును, స్మృతియునుఁ గూడఁ దప్పి, కథను గోదావరిలోనో, గంగలోనో కలిపినవారై తమ శక్తి లేమి నెఱింగియు నితరుల శక్తినిఁజూచి యోర్వలేక యందని మ్రాని కఱ్ఱులు సాఁపుచు సత్కీర్తినిఁ గోరుచుఁ బిదప దానికి వ్యతిరేకమగు దానినే వడయచున్నవారిని గొందఱినిఁ జూచిన యెల్లరకు నీ బాలసరస్వతుల యసమాన సామర్ధ్యమత్యాశ్చర్యముఁ గలిగించెను, ఆ నాఁడే యీ సోదర కవి సింహులకు రు. 116-0-0 పారితోషిక మొసంగఁబడి బంగరు పతకంబులుఁగూడ వాగ్దానము సేయఁబడెను. బహుమానమునొసంగి నప్పుడది గ్రహించి బెల్లముఁ గొట్టిన రాళ్ల వలె నూరకుండెడి కొందఱవలెఁ గాక తమ సంతోషము నంగీకారమును వెల్లడించుచుఁ బ్రతిపద రసభావ గుంభితంబులుగా నొక యేఁబది పద్యములఁ జెప్పి సభాస్తారుల రంజింపఁ జేసిరి. ఇట్టి సోదర కవియుగ్మమున కత్యంతాయురారోగ్య భాగ్యంబుల నింకను వెలయించి సర్వకామిత ప్రదుండగు భగవంతుండు నిరంతరంబును రక్షించుఁగాత.

బాపట్ల,

20-9-1911

ఇట్లు,

చంద్రమౌళి చిదంబరరావు