పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుండవరపు లక్ష్మీనారాయణ గారు గుంటూరు సీమకు Son of the Soil. కొప్పరపు కవులు పుట్టి, పెరిగి, వికసించి, విజృంభించి కీర్తిమంతులైన నేలను నాలుగు చెరుగులా స్పృశించి ఆరు రుచులనూ ఆస్వాదించిన బుద్ధిజీవి. కొప్పరపు కవుల కృతులు కుంటముక్కల జానకి రామశర్మగారు, మిన్నికంటి గురునాధశర్మగారు, నిడుదవోలు వేంకటరావుగారు కొంతమేరకు సంగ్రహించి పరిరక్షించినా జాతి బాధ్యత అంతటితో తీరిపోదని త్రికరణ శుద్ధిగా నమ్మి, ఆ పద్యాల సేకరణను గ్రంథస్థాయికి చేర్చి దానిని ఒక సంప్రదాయంగా ఏర్పరచాలని కూడా త్రికరణ శుద్ధిగా సంకల్పించాడు దాని ఫలితమే ఈ పుస్తకం గుండవరపు లక్ష్మీనారాయణ గారు తెలుగు అధ్యాపక వృత్తిలో కాకలు తీరినవాడు. తన డాక్టరేట్ డిగ్రీ కోసం ఆయన ఎన్నిక చేసుకున్న వస్తువు “ఆదిభట్ల నారాయణ దాసు". అక్కడ ఆయనకు సంగీతాశ్రమమైన కవిత్వం మృష్టాన్న భోజనమైంది. కాని పంచభక్ష్యాల కోసం షడ్రుచుల కోసం ఆయన ఆశ్రయించినది శ్రీనాధ మహాకవి భీమేశ్వర పురాణము. తన మానసానందం కోసం బుడి బుడి నడకలతో కొప్పరపు కవుల కవిత్వ దివ్య భవనములోకి ప్రవేశించి అక్కడ అంతేవాసియై స్థిరపడ్డాడు. ఇది ఒక విశిష్ట క్రమశిక్షణ ఫలితము అందువలన వినయంతో, పరిపుష్టతా తృష్ణతో రూపొందించిన ఈ సంచయం కవిత్వ పిపాసువులకు కొంత కొత్త వెలుగును ప్రసాదిస్తుంది.

గుండవరపు లక్ష్మీనారాయణ గారీలో నా దృష్టికి ఇంపుగా కనపడిన రెండు విషయాలు ఉన్నాయి. ఇంగ్లీషులో "Rome is not Built in one day" అని ఒక నుడికారం ఉంది. తొమ్మిది నెలలు మోస్తేనే గాని ఏ బిడ్డా పుట్టదు. ఈ స్పృహ ఆయనకు కొప్పరపు కవుల పద్యాలను సంచయం చేయడం సందర్భంగా తనువునా హస్తానా నిబద్ధితమై ఉంది. అందువలన ఈ సంచయ ప్రచురణ ఆలోచన ఆయనలో జనించి దాదాపు రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటి వరకూ ఆయన ఓపిక పట్టాడు. అరకొర శ్రద్ధతో, వేగిరపాటుతో చేసి ఉంటే ఈ పుస్తకం పదహారేళ్ల క్రిందటే వెలువడి ఉండేది. ఇది ఇలా ఉండగా లక్ష్మీనారాయణ గారికి జనార్దన స్వభావమే గాని ధనార్జన చాపల్యం లేదు. జనప్రియత ఏర్పడని ఏ వస్తువు గాని పదార్థం గాని మొదటి ప్రయత్నం లోనే లాభాలు తెచ్చిపెట్టదు - అనే సత్యాన్ని గ్రహించినవాడు తాను వ్రాసిన తిరుపతి వేంకటీయము కవుల కలహాలు. నారాయణ దర్శనము గాని, భీమేశ్వర పురాణ వ్యాఖ్యా గ్రంధాది పుస్తకాలు గాని ఎంత డబ్బు పెట్టుబడిగా వెచ్చిస్తే వచ్చాయి; అమ్మకం వల్ల ఏమాత్రం లాభం చేకూరింది అనే ప్రశ్నలూ విచికిత్సలూ సంభవించనివ్వని మనస్తత్వం ఆయనది

కొప్పరపు కవుల కృతులు జనంలోకి రాకుండా ఉండిపోవడానికి వాటి గ్రంధస్థత్వ దుస్సాధ్యత ఒక కారణమైతే రెండవది నియోగి వైదికి వైరస్యం కవిత్వ సృజనకు శాస్త్ర, పురాణ, శ్రుతి వ్యాకరణ

చందాది జ్ఞానాలలో పరిణతికి తోడుగా ప్రాపంచికత, లౌక్యం, హూందా కూడా ఉంటే ఆ కృషికి రాణ అని నమ్మినవారు కొందరు. జ్ఞానం, పరిజ్ఞానం, భావుకత, వినయంఉంటే చాలునని

xxxx