పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావించనవారు కొందరు. సహజంగానే మొదటివారు నియోగులుగా రెండవవారు వైదికులుగా ముద్రలు పడ్డారు. ప్రవృత్తిలో ఉన్న ఈ ప్రాధమిక విభేదం బ్రాహ్మణులలో ఆ శాఖల లోనికి ప్రవేశించి నియోగి కవిత్వము - వైదిక కవిత్వము అని రెండు విరసభావాలు కవిప్రజలో నెలకొన్న విధం సంభవించింది. శాఖా విభేదం వలన విద్యలలో కలిగిన స్పర్ధ ("పూను స్పర్ధను విద్యలందే”) ప్రకారం ప్రచార ఆదరణలు వారికి వేరు వీరికి వేరుగా సిద్ధమయ్యా యి. తిరుపతి వేంకటకవులు (దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రి) కొప్పరపు సోదర కవులు (కొప్పరపు వేంకట సుబ్బారాయశర్మ, వేంకట రమణ శర్మ! సమకాలికులైన రెండు జంటల కవులు. మొదటి జంట వైదికులు, రెండవ జంట నియోగులు. గుంటూరు సీమలో కవిత్వ రంగాలలోనే కాక వ్యవహార రంగంలో కూడా నియోగి - వైదికి వైరస్యం శతాబ్దాల చరిత్ర కలిగినది. తిరుపతి వేంకట కవులు అచ్చంగా గుంటూరు సీమకు చెందినవారు కాకపోయినా వారిలో కవిత్వ శక్తికి సరి సమానంగా ఉండిన లౌక్యసంపద వారిని ఉన్నతాసనంలో కూర్చోబెట్టింది. వారికి అశేషమైన వ్రాయసగణం, శిష్యగణం ప్రాప్తించారు. అవధానాల విషయానికి వస్తే అక్కడ ధారణ, చమత్కారం ప్రధానాంగాలు. ఈ రెండింటిలో ఆ జంట కవులకు, ఈ జంట కవులకు సమాన ప్రతిపత్తి, ఆశుధారా విషయానికి వస్తే కొప్పరపు కవులదే నిస్సంశయంగా పై చేయి. కాని ఆశుధారలు వ్రాయసకత్వానికి నోచుకోవు. కనుక వీరి పీట వెనుక వరుసకు తప్పుకోవలసి వచ్చింది. తిరుపతి కవులు తాము ఆశువుగా చెప్పిన ప్రతి పద్యాన్ని వెంట వెంటనే వ్రాయసకాండ్ర ద్వారా పరిరక్షించుకోగలిగారు. ఎవరికి ఎన్ని సన్మానాలు, ఎన్ని కంకణాలు, ఎన్ని భుజకీర్తులు, ఎంతలేసి కీర్తులు అనేది అప్పుడు ప్రస్తుతమే గాని ఇప్పుడు అప్రస్తుతం. గుండవరపు లక్ష్మీనారాయణ గారు తమ సుదీర్ఘమైన సాహితీ అభ్యాసంలో వారిని వీరిని అనకుండా అధ్యయనం చేసినవారు మృతివలన స్మృతులు గతములౌతాయి. (Death is the leveller) కనుక ఇప్పుడు క్షీరనీర విచక్షణతో కవితాస్వాదన చేయగల మనకు అందరూ సమానులే.

అన్ని సంపదలకు వలెనే కవితా ప్రతాపానికి కూడా వారసులుంటారు. వీరు కుటుంబాలలోంచి రావచ్చు, లేదా ఆలోచనా ధోరణుల నుండి రావచ్చు. తిరుపతి వేంకట కవులకు విశ్వనాధ సత్యనారాయణ గారి వంటి దిగ్దంతులైన వారసులు ఉన్నారు. వారికి 'ప్ర-వారసులు' ఉన్నారు. కాని కొప్పరపు సోదర కవులకు వారసులు లేరు అయితే ఆస్తుల స్వీకారం వలన గాని ధోరణుల అవలంబన వలన గాని ఏర్పడని వారసులు కొప్పరపు కవులకు ఉన్నారు. వారే కుంటముక్కల జానకి రామశర్మ గారు, మిన్నికంటి గురునాధ శర్మగారు, నిడుదవోలు వేంకటరావు గారు, గుండవరపు లక్ష్మీనారాయణ గారు, మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మగారలు.

ఈ పుస్తక ప్రచురణా యజ్ఞంలో గుండవరపు లక్ష్మీనారాయణ గారు ఋత్విక్ కాగా మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మ ఘృతంగా తన పాత్రను నిర్వహించి మనలకు ఈ ఆస్వాదనను సుస్వాద్యం చేసిపెట్టాడు. వీరిరువురికీ నా శుభాశీస్సులు

xxxxi