పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిగారి గ్రంధములకు శ్రీకవితా వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు పూనుకొన్నట్లు వీరావేశమెత్తినడుమునకు గుడ్డబిగించిలేచి విరాళములకుఁదిరిగి "సంతస్స్వయం పరహితే విహితాభియోగాః" ఎవరేమన్నను సరకుగొనక విరాళములసేకరించి యనుకొన్నపనిపూర్తిచేసి కృతార్ధులైరి. వీరు సహృదయులేగాక సరసులేగాక సత్కవులును. భగవద్గీత నాంధ్రపద్యములలో వ్రాసిరి. శ్రీరామనామ సంకీర్తనామృత మను సరసమైన కృతిని రచించిరి. సావిత్రీ సత్యవతీయమను నాటకమువ్రాసిరి. భగవంతుఁడీ పరోపకారశీలున కభ్యుదయ నిశ్శ్రేయసము లొసఁగుఁగాక. శ్రీఏకా ఆంజనేయులు పంతులుగారు “శాంతి” నచ్చువేయించుచున్నపుడు నేనింక నేగ్రంధమునచ్చు వేయింపలేను వేయింపను అనిరి. అని ఆమాటమీఁద నిలచిరా! అబ్బే! వాయియట్లన్ననుచేయి తనపనితాను జేయుచునేయుండెను. ఎన్నోగ్రంధముల నచ్చువేయించుచునేయుండెను. ఇటీవల శ్రీ జాషువా ఖండకావ్యము కైపులోఁ బడి గ్రహించినదిగూడ. దానవీరమననిట్టిదే. ఆలంకారికులు వర్ణించినదీ దాన వీరమునే. ఈదానవీరరసమందే యిప్పుడె పంగిడిగూడెము శతావధానము తడిసి ముద్దైనది. శ్రీ ఆంజనేయులు పంతులు గారికి భగవంతుఁడు దీర్ఘాయు వొసగుఁగాక.

గుంటూరు.

15-3-1963

ఇట్లు,

మిన్నికంటి గురునాథశర్మ

xxxiii