పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనకుఁ దీఱని వ్యాఘాత మేర్పడినది. దశ తొలఁగినది. నలువదియాఱేండ్ల నడిప్రాయముననే నాకమున కరిగిరి. 29-3-1932 వీరి నిర్యాణము. ఆ యింటికళ వీరితోనేవచ్చి వీరితోనే పోయినది. పిమ్మట వేంకటరమణ కవిగారు తమ సోదరుఁడగు బుచ్చిరామ కవిగారినిగూడి సోదరకవులన్న పేరు నిలుపుటకుఁ కొన్ని సభలొనర్చిరి. ఆవల వారును 21-3-1942లో గతించిరి. బుచ్చిరామకవి గారు 29-5-1956లో గతించిరి.

సోదరకవులకడగొట్టు తమ్ముఁడు లక్ష్మీనారాయణగారు. వీరును గాలేజిలోఁ జదువుకొనుచున్నప్పుడే యాశువుచెప్పెడివారు. కనుకనే "కవుల పుట్టిల్లు సోదరకవుల యిల్లు” అన్న కీర్తి వచ్చినదని 'ఆధునిక కవిజీవితములను గ్రంథమున 33 పుటలో వ్రాయఁబడెను. కొప్పరపు సోదరకవులతరము గడచిన పిదప శ్రీ వేంకటసుబ్బరాయకవిగారి కొడుకు సీతారామప్రసాదరావు, వేంకటరమణకవిగారి కొడుకు మల్లికార్జునరావు 'కుమారసోదర కవులు' అనుపేర బయటికివచ్చిరి. నేను గుంటూరు టవున్ హైస్కూలులో ప్రధానాంధ్రపండితస్థానమందుండఁగా వీరు 5-వ ఫారములోనే పద్యములల్లసాఁగిరి. అందలి తప్పులను వివరించి చెప్పుచు నుందును. ఆ కవిత్వపు పిచ్చివలననేయేమో 6-వ ఫారము తప్పిరి. పిదపవీరు బడివదలి అష్టావధానము లొనరింపసాఁగిరి, ఇంతలో దైవముకంటికిఁబేలగింజయుఁ బెద్దగాఁగన్పించినది. మల్లికార్జునరావు వెళ్లిపోయెను. ఇప్పుడు సీతారామ ప్రసాదరావొక్కఁడే అవధానములొనర్చుచున్నవాఁడు.

ప్రస్తుతము కొప్పరపు సోదరకవుల శతావధానములనెల్లఁ బునర్ముద్రణ మొనరించి యందింప బ్రహ్మశ్రీ కుంటముక్కల వేంకటజానకీరామశర్మగారు పూనుకొనిరి. వీరు డెబ్బదియేండ్లవృద్ధు. కనఁబడనిజబ్బుతో కలఁతపడుచుందురు. వీరిది తెనాలి తాలూకా పెనుగుదురుపాడు. ఎక్కడికోప్పరము? ఎక్కడి పెనుగుదురుపాడు? వీరెవరు? వారెవరు? వారికి వీరికేమి సంబంధము వీనినచ్చొత్తించినఁ దదీయులు వృద్దులెవరు సంతోషింతురు? అయినను శ్రీబెల్లముకొండ రామరాయ

xxxvii