పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

రాముని గళమున సీత గజపుష్పమాల వైచుట

గజదనుజ వైరి ధనువున్
గజిబిజి లేకుండ విరిచి ఖ్యాతింగను నం
గజమూర్తి రాము గళమున
గజసుమ దామంబువైచె గజగమన తగన్.

కళాశాలలోఁ జెప్పిన భీష్మజననము నందలి పద్యములు, ఇష్టదేవతా ప్రార్థనము

శ్రీయుత కృష్ణరాణ్ణృపతి శేషగిరీంద్రఘనుండు సూర్యనా
రాయణ మూర్తియుం బిలువ నస్మదమేయ కవిత్వ శక్తిఁ దా
రీ యెడఁజూడఁ జేరిన యహీనులు కాకపురీ సుధీంద్రు లౌ
రా! యని మెచ్చ మమ్ము విజయాఢ్యులఁ జేయఁగదమ్మ శాంభవీ!

కథారంభమునందు భీష్మునిట్లభివర్ణించిరి.

గంగా మహాదేవి కడుపు చల్లఁగఁ బుట్టి
         గాంగేయుఁడనుపేరు గాంచినాఁడు
వసు సప్తకంబిడు వరశక్తిచే నల
         శక్తిసాధను మించఁ జాలినాఁడు
కన్నతండ్రి యభీష్ట మున్నతంబగు భక్తిఁ
         దీర్చి యింద్రియగర్వ మోర్చినాఁడు
పరశురామునిఁ బోరఁ బరిభవం బందించి
         యేక వీరఖ్యాతి నెసఁగినాఁడు

విష్ణు భక్తాగ్రగణ్యుఁడై వెలసినాఁడు
సకల భువనాద్భుతక్రియల్ సలిపినాఁడు
ఘనుఁడు దేవవ్రతుఁడు భీష్ముఁడనఘ చరితుఁ
డమ్మహామహు కథఁదెల్ప నలవియగునె!