పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞప్తి

బాలసరస్వతి, ఆశుకవీంద్రసింహ, ఆశుకవిచక్రవర్తి, కుండినకవిహంస, కవిరత్న, అవధాని పంచానన, కవి కేసరి, కల్పిత కవితా రచనాధురీణ, కవిభూషణ, ప్రౌఢభారతి, కధాశుకవీశ్వర, ఆశుకవిశిఖామణి, ఆశుకవిసమ్రాడిత్యాది బిరుద విరాజితులును, జగద్విఖ్యాత యశోధురంధరులును, శతావధానులునైన, బ్రహ్మశ్రీ వేంకట సుబ్బరాయశర్మ, వేంకట రమణశర్మ నామక కొప్పరపు సోదర కవులచే నొనర్పఁబడి ముద్రణమునొంది, దాదాపిప్పటికి ముప్పది సంవత్సరముల క్రిందట నాకు లభించిన, గుంటూరు, బాపట్ల, విశదల, చీరాల, పంగిడిగూడేముల శతావధానాదికము లెన్నియోమారులు పఠించి, యందలి మృదుమధుర వాక్సుధారస మహా ప్రవాహంబున నోలలాడి, యమితానందభరితుండనైతిసని వాక్రుచ్చుట యతిశయోక్తి కానేరదు.

ఏతదవధానము లిప్పుడెచ్చటను లభించుటలేదు. అందుచే వాని నన్నిటినిఁ బునర్ముద్రణ మొనరించి, లోకవ్యాప్తి నొందింపఁ జేయవలయునను సంకల్పము, కొంత కాలమునుండి నన్నుఁ బ్రేరేప, డెబ్బది సంవత్సరముల వయోవృద్ధుఁడను, నశక్తుండనైన నేనీ కార్యరంగమునకు దిగక తప్పినదికాదు.

కొందఱఁబిన్న పెద్దలను సందర్శించి, వారికి నా సంకల్పము నెఱింగించి నంతనే తమ యామోదమును వెల్లడించి, నేను గోరిన ప్రకారము ధనమిచ్చి, ధైర్యోత్సాహములు గలిగించి, మదాశయసిద్ధికిఁ డోడ్పడిరి. అట్టి అభిమానవంతులకును, తెనాలి మారీసుపేట వాస్తవ్యులు బ్రహ్మశ్రీ యల్లంరాజు సూర్య నారాయణ పంతులు, బి.ఏ.బి.యల్, అడ్వొకేటుగారి ప్రోత్సాహమున, చీరాల శతావధాన పునర్ముద్రణమునకు వలయు ధనమొసంగి, నన్నుఁ గృతార్థుఁజేసిన, తెనాలి గంగానమ్మపేట కాపురస్థులు శ్రీ సంకా సుబ్బారాయఁడుగారి దత్త పుత్రులు, వణిక్పుంగవులు, వదాన్యులునగు శ్రీ సంకా వేంకటేశ్వర్లు గారికిని, భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యము లొసంగి రక్షించుఁగాత.

xxv